ఫుట్‌పాత్ మీద న‌డుస్తున్న‌ ఓ యువ‌తికి వేలాడుతున్న క‌రెంటు తీగ‌ తాక‌డంతో అక్క‌డిక‌క్క‌డే క‌న్నుమూశారు. ఈ ఘ‌ట‌న‌లో ఆమె తొమ్మిది నెల‌ల చిన్నారి కూడా చ‌నిపోవ‌డంతో తీవ్ర విషాదం నెల‌కొంది

విధాత‌: ఫుట్‌పాత్ మీద న‌డుస్తున్న‌ ఓ యువ‌తికి వేలాడుతున్న క‌రెంటు తీగ‌ తాక‌డంతో అక్క‌డిక‌క్క‌డే క‌న్నుమూశారు. ఈ ఘ‌ట‌న‌లో ఆమె తొమ్మిది నెల‌ల చిన్నారి కూడా చ‌నిపోవ‌డంతో తీవ్ర విషాదం నెల‌కొంది. క‌రెంటు స‌ర‌ఫ‌రా సంస్థ నిర్ల‌క్ష్యం కార‌ణంగా రెండు నిండు ప్రాణాలు బ‌లి అయిపోయిన ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరు (Bengaluru) లో ఆదివారం ఉద‌యం చోటుచేసుకుంది. 23 ఏళ్ల సౌంద‌ర్య అనే యువ‌తి, ఆమె తొమ్మిది నెల‌ల కుమార్తె సువేక్ష క‌లిసి బెంగ‌ళూరు వైట్‌ఫీల్డ్‌లోని హోప్ ఫాం జంక్ష‌న్‌లో ఉద‌యం 6 గంట‌ల‌కు న‌డుచుకుంటూ వెళుతున్నారు.

ఆ క్ర‌మంలో తెగిపోయి కింద ప‌డి ఉన్న క‌రెంట్ వైర్ ఆమెకు తగిలిన‌ట్లు తెలుస్తోంది. వెంట‌నే క‌నురెప్ప‌పాటులో సౌంద‌ర్య, ఆమె కుమార్తె విద్యుదాఘాతానికి గురై మంటల్లో చిక్కుకుపోయారు. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది, పోలీసులు అక్క‌డ‌కు చేరుకునే స‌రికే త‌ల్లి, చిన్నారి ఇద్ద‌రూ క‌న్నుమూశారు. ఈ ఘ‌ట‌న‌పై న‌గ‌ర వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఐటీ ఉద్యోగులు, ఉన్న‌త వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉండే వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోనే ప‌రిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఇంకెంత దారుణంగా ఉంటుందోన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో తీగ‌లు తెగిపోతున్న ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని వైట్‌ఫీల్డ్ అసోసియేష‌న్ తెలిపింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి బెంగ‌ళూరు ఎల‌క్ట్రిసిటీ స‌ప్లై కంపెనీ లిమిటెడ్ ఉద్యోగులు ముగ్గురిని స‌స్పెండ్ చేసి ప్ర‌శ్నిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Updated On
Somu

Somu

Next Story