ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి అనేక హామీలను ఇస్తుంటాయి. అయితే అవి కొంతవరకే పనిచేస్తాయి. అభ్యర్థి వ్యక్తిగత పనితీరు కూడా ఎన్నికల్లో ప్రమాణికం అవుతుంది

భయపడుతున్న రాజకీయ పార్టీలు
విధాత: ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి అనేక హామీలను ఇస్తుంటాయి. అయితే అవి కొంతవరకే పనిచేస్తాయి. అభ్యర్థి వ్యక్తిగత పనితీరు కూడా ఎన్నికల్లో ప్రామాణికం అవుతుంది. బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటర్లకు మరో ఆయుధం కూడా ఉంటుంది. అభ్యర్థుల తలరాతను మార్చే ఆయుధం ఎన్నికల సంఘం ఓటర్లకు ఇచ్చింది. అదే నోటా! నన్ ఆఫ్ ది ఎబో! రెబల్స్ బెదడతో పాటు, పార్టీ గుర్తును పోలిన గుర్తులు, ఒకే పేరు ఉండే అభ్యర్థులు ఇలా అనేక సమస్యలు ఉంటాయి.
వీటితో పాటు నోటా కూడా ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిస్తుందా అంటే ఔననే సమాధానమే వస్తుంది. అభ్యర్థుల అంచనాలను తలకిందులు చేసే పాశుపతాస్త్రం అది. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ చాలా శ్రమిస్తున్నది. అయితే పోటీలో ఉండే అభ్యర్థులు కావొచ్చు, పార్టీ విధానాల కావొచ్చు, ప్రస్తుత రాజకీయాల పట్ల విముఖత కావొచ్చు ఇలా అనేక కారణాలతో కొంతమందికి ఓటింగ్ సమయంలో దూరంగా ఉంటారు. కానీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీ ఓటు రికార్డు కావాలని ఎన్నికల కమిషన్ ఇచ్చి వజ్రాయుధం నోటా ఇప్పుడు అభ్యర్థులను కలవరపరుస్తున్నది. ఇది పైకి తేలిగ్గా కనిపించినా తటస్థంగా ఏ పార్టీ వైపు మొగ్గుచూపకుండా నోటాకు వేస్తే అవే కొంతమంది గెలుపోటములను నిర్ణయిస్తాయని తేలింది. 2018 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ కావడం గమనార్హం. దాదాపు 70 నియోజకవర్గాల్లో నోటాకు ఐదు లోపు స్థానం దక్కింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు 171 ఓట్ల ఆధిక్యంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మిపై విజయం సాధించారు. ఈ నియోజకర్గంలో నోటాకు పడిన ఓట్లు అక్షరాలా 2,711. అంటే.. ఆత్రం సక్కు సాధించిన మెజార్టీ కన్నా ఎక్కువ. మరో నియోజకవర్గం ధర్మపురిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై 441 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ నోటాకు పడిన ఓట్లు 2,597. అలాగే ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 376 మెజారిటీ రాగా నోటాకు 1,145 ఓట్లు లభించాయి. అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై 1,016 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచిన నోటాకు పడిన ఓట్లు 1,462. కోదాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ 756 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా.. నోటాకు 1,240 ఓట్లు లభించాయి. వైరా నియోజకవర్గంలో రాములు నాయక్.. తన సమీప ప్రత్యర్థి బానోత్ మదన్‌లాల్‌పై 2,013 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 2,360.
నోటాకు పడిన ఓట్లు ఏ అభ్యర్థికి పడినా తలరాతలు తలకిందులయ్యేవి. గెలుపు ఓటములపై కచ్చితంగా ప్రభావం చూపేవి. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నోటా ఎక్కడా కూడా చివరిస్థానంలో నిలువలేదు. 70 నియోజకవర్గాల్లో 5వ స్థానంలోకి నిలిచింది. 2018లో మొత్తం పోలైన ఓట్లు 2.04 కోట్లు. అంటే 79.7 శాతం పోలింగ్ నమోదవ్వగా.. అందులో నోటాకు ఏకంగా 2,24,709 ఓట్లు లభించాయి. అంటే మొత్తం పోలైన ఓట్లలో 1.1 శాతం. ఒక్క శాతం ఓట్లే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు.
ఒక్క ఓటు గెలిచినా గెలిచినట్టే. ఒక్క ఓటుతో ఓడినా ఓడినట్టే. అంతెందుకు ఒక్క ఓటుతో నాడు పార్లమెంటులో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నువ్వా నేనా అని తలపడుతున్నాయి. బీజేపీ ప్రభావం కొన్ని నియోకవర్గాల్లో ఉంటుంది. అక్కడ త్రిముఖ పోరు తప్పకపోవచ్చు. వీటికి తోడు నాయకులు రాత్రికి రాత్రే కండువాలు మార్చడం వంటివి కొందరిని నోటా వైపు మళ్లించే అవకాశం లేకపోలేదు. పోలింగ్ కేంద్రాలవారీగా ఓట్ల లెక్కలు వేసుకునే పార్టీలకు.. నోటా ఓట్లు కూడా గెలుపోటములను నిర్ణయిస్తాయన్నది గత ఫలితాలను చూస్తే అర్థమౌతుంది.
