ఇంఫాల్‌లో గగనతలంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో) కనిపించిందన్న వార్తలతో గగ్గోలు రేగింది

  • మూడు గంటలపాటు విమాన రాకపోకలు బంద్‌
  • టికేంద్రజిత్‌ విమానాశ్రయంలో కలకలం

ఇంఫాల్‌ : ఫ్లయింగ్‌ సాసర్‌! ఎగిరే పళ్లెం అని కూడా పిలిచే.. గ్రహాంతరవాసులు వినియోగించే విమానంగా చెప్పే ’యూఎఫ్‌వో’! ఇది ఆకాశంలో కనిపించిందని అప్పుడప్పడు వార్తలు వస్తుంటాయి. కానీ.. నిజంగా ఇవి ఉన్నాయా? లేవా? అనేది ఎప్పుడూ సంశయమే! తాజాగా మరోసారి ఫ్లయింగ్‌సాసర్‌ వార్తల్లోకి వచ్చింది. ఇంఫాల్‌లో గగనతలంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో) కనిపించిందన్న వార్తాలతో గగ్గోలు రేగింది. దీంతో ఇంఫాల్‌లోని టికేంద్రజిత్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మూడు గంటలపాటు విమానాల రాకపోకలను నిలిపేశారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఒక గుర్తు తెలియని ఎగిరే వస్తువును గుర్తించి, అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఈ కలకలం రేగింది.


ఇంఫాల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి అందిన చిత్రాలతో ఎయిర్‌ డిఫెన్స్‌ రెస్సాన్స్‌ మెకానిజం వెంటనే యాక్టివేట్‌ అయిందని ఈస్టర్న్‌ కమాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తు తెలియని ఎగిరే వస్తువు చాలా చిన్నగా ఉన్నదని, డిఫెన్స్‌ మెకానిజం క్రియాశీలం కాగానే.. కనిపించకుండా పోయిందని పేర్కొన్నది. ఈ ఉదంతం ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వెలుగుచూసినట్టు భారత విమానయాన సంస్థ తెలిపింది. ఇంఫాల్‌ విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)కి కేంద్ర పరిశ్రమల రక్షణ దళం (సీఐఎస్‌ఎఫ్‌) కంట్రోల్‌ రూం నుంచి వచ్చిన టెలిఫోన్‌ సందేశంతో అప్రమత్తమైనట్టు పేర్కొన్నది. టెర్మినల్‌ భవనంపై ఒక యూఎఫ్‌వో ఎగురుతున్నట్టు ఆ సందేశం సారాంశం. అది ఏటీసీకి దక్షిణం వైపు కదలుతూ కొద్దిసేపు అక్కడే స్థిరంగా ఎగిరిందని ఆ సందేశం పేర్కొన్నది. అనంతరం విమానాశ్రయం నైరుతి దిశగా కదిలిందని, సాయంత్రం 4.05 గంటల వరకు కనిపించి.. తర్వాత అదృశ్యమైందని తెలిపింది.


ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌లోని సిబ్బంది, ప్రజలు, స్థానిక పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా దీనిని చూశారని, అదేంటో ఎవరూ గుర్తు పట్టలేకపోయారని పేర్కొన్నది. ఈ యూఎఫ్‌వో తెల్లని రంగుతో కనిపించిందని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ ‘మిషన్‌ రెడ్‌ అండ్‌ మిషన్‌ బ్లూ’ను చేపట్టింది. విమానాశ్రయంలో రాఫెల్‌ యుద్ధ విమానాన్నీ మోహరించారు. ఇదంతా 5.35 గంటల వరకూ కొనసాగింది. చివరకు 5.50 గంటలకు ఐఏఎఫ్‌ క్లియరెన్స్‌ ఇవ్వడంతో తిరిగి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. ఇంతకీ అదేంటో ఎవరూ చెప్పలేకపోయారు.

Updated On 20 Nov 2023 11:52 AM GMT
TAAZ

TAAZ

Next Story