Karimnagar | కళోత్సవాల పేరిట వ్యాపారులు, కాంట్రాక్టర్ల వద్ద 10 కోట్లు వసూలు తీగల వంతెన ప్రారంభోత్సవం పేరుతో మరో దోపిడీకి సిద్ధం ఇసుక, గ్రానైట్, మట్టి యదేచ్చగా అక్రమ రవాణా అధికార పార్టీ నేతలు అవినీతికి మూల్యం చెల్లించక తప్పదు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యులు తమ అవినీతికి ప్రజలకు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ […]

Karimnagar |

  • కళోత్సవాల పేరిట వ్యాపారులు, కాంట్రాక్టర్ల వద్ద 10 కోట్లు వసూలు
  • తీగల వంతెన ప్రారంభోత్సవం పేరుతో మరో దోపిడీకి సిద్ధం
  • ఇసుక, గ్రానైట్, మట్టి యదేచ్చగా అక్రమ రవాణా
  • అధికార పార్టీ నేతలు అవినీతికి మూల్యం చెల్లించక తప్పదు
  • మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యులు తమ అవినీతికి ప్రజలకు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు (Gone Prakash Rao) హెచ్చరించారు. ఇప్పటికైనా వారు తమ ప్రవర్తన మార్చుకోవాలని, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. బుధవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ
మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

కరీంనగర్ పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరుతో 500 కోట్లు కేటాయిస్తే మంత్రి అనుచరులు బినామీ పేర్లపై కాంట్రాక్టులు దక్కించుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం విడుదలైన నిధులపై శ్వేత పత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కరీంనగర్లో కేంద్ర నిధులు దుర్వినియోగం అవుతుంటే స్థానిక ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు ఈ అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇసుక, గ్రానైట్, మట్టి అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందని ఆయన ఆరోపించారు. కరీంనగర్ పట్టణ సమీపంలోని చేగుర్తి గ్రామం నుంచి ప్రతిరోజు 50 లారీల అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపించారు.

లారీలకు పర్మిట్లు గాని, లైసెన్సులు గాని లేకపోవడం ఆశ్చర్యకరం అన్నారు. సామాన్య ప్రజానీకం జీవితాంతం పనిచేస్తే రోజు తిండి లేని జీవితాలు వెల్లదీస్తుండగా, అధికార పార్టీకి చెందిన నేతలు అనతి కాలంలో వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల అక్రమ సంపాదన పై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

కళోత్సవాల పేరా భారీ దోపిడీ

గత ఏడాది సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు కరీంనగర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన కళోత్సవాల పేరిట స్థానిక వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుండి 7 నుండి 10 కోట్లు వసూలు చేశారని ప్రకాష్ రావు ఆరోపించారు. కరీంనగర్లో పనిచేస్తున్న ఏసీపి ఆధ్వర్యంలో ఈ వసూళ్ల పర్వం కొనసాగిందని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలు పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కాకుండా ఒక కళా సంస్థ ఆధ్వర్యంలో ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత మంత్రి గంగుల కమలాకర్ పై ఉందన్నారు.

సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడానికి రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక సారథి అనే సంస్థ ఒకటి ఉందన్నారు. ఉత్సవాల పేరిట వసూలు చేసిన మొత్తంలో ఒక కోటి రూపాయలు వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఉత్సవాల తర్వాత వాటికి హాజరైన కళాకారులను ఎక్కడ ఉపయోగించుకున్నారో, అందుకు సంబంధించిన సమాచారం తన వద్ద మొత్తం ఉందన్నారు.
ముఖ్యమంత్రి సమయం ఇస్తే అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు అందజేయడానికి సిద్ధం అన్నారు.

తీగల వంతెన పేరిట.. మరో దోపిడీకి తెర

పర్యాటక అభివృద్ధి పేరుతో మానేరు పరివాహక ప్రాంతంలో నిర్మించిన తీగల వంతెన ప్రారంభోత్సవం కోసం మరో దోపిడీకి తెరతీసారని ప్రకాష్ రావు ఆరోపించారు. దీని ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాపారులు, కాంట్రాక్టర్ల మీద పడి మళ్లీ దోపిడీకి సిద్ధం అవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలు కరీంనగర్ పట్టణాన్ని లూట్ మార్ చేస్తున్నారని చెప్పారు.
తీగల వంతెన ప్రారంభోత్సవ సమయంలో లక్నోలో జరిగే కవ్వాలి లాంటి తంతు ఏర్పాటు చేసి, నోట్లు వెదజల్లే ప్రయత్నాలు చేయిస్తున్నారని మండి పడ్డారు.

Updated On 24 May 2023 8:09 AM GMT
Somu

Somu

Next Story