- తల్లి తండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ఆదుకుంటా
- సంపాదనలో 50 శాతం.. స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తా
- రాజకీయ వారసుడు మైనంపల్లి రోహిత్ ను ప్రజలకు పరిచయం
- నా కుమారుడు అండగా ఉంటాడు ఆదరించండి
- స్వంత మండలం చిన్న శంకరంపేట్ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
- మాల్కాజి గిరి ఎమ్మెల్యే మైనంపల్లి
విధాత,ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజకవర్గంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను గుర్తించి 25 వేల చొప్పున ఫిక్సుడ్ డిపాజిట్ చేసి పిల్లలను ఆదుకుంటామని అందుకు నియోజకవర్గం మొత్తానికి 10 కోట్లు ఖర్చు చేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మైనంపల్లి ట్రస్ట్ ద్వారా నా కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతారని ఎమ్మెల్యే ప్రకటించారు. భారీ ర్యాలీ,బహిరంగ సభ చిన్న శంకరం పేట మండల కేంద్రంగా జరిగింది.
సోమవారం తన కుమారుడు డాక్టర్ రోహిత్‌తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిన్న శంకరం పేట బస్టాండ్ నుంచి పట్టణంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీతో శ్రీసోమేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని స్వామి వారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ రోహిత్ అనాధ బాలికకు 25 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని అందించి మైనంపల్లి ట్రస్టు సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ ఇక నుంచి మెదక్ నియోజకవర్గంలో నా కుమారుడు డాక్టర్ రోహిత్ మైనంపల్లి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అనాథ పిల్లల కోసం రూ.కోటి 25 లక్షల చొప్పున రూ.10 కోట్లు ఖర్చు చేస్తానన్నారు.
నాకు రాజకీయ బిక్ష పెట్టింది మెదక్ జిల్లా ప్రజలేనని, రామాయంపేట, మెదక్ నియోజక వర్గాల ప్రజలు అసెంబ్లీకి పంపించారని గుర్తు చేసుకున్నారు. ఇకపై తన రాజకీయ వారసుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై కూడా ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. డాక్టర్ రోహిత్ మెదక్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాడని స్పష్టం చేశారు.
నా సంపదలో 50 శాతం సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తానన్నారు. నాకంటే ఎక్కువగా ఎవరైనా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తే వారిని ఆదరిస్తానన్నారు. మూడు నాలుగు రోజుల్లో అనాథ పిల్లలకు 25 వేల రూపాయల డిపాజిట్ పత్రాలను నా కుమారుడు డాక్టర్ రోహిత్ అందజేస్తాడని తెలిపారు.
ప్రతి మండలంలో 500 మందికి ఈ సాయం అందేలా చూస్తానన్నారు. మండలాల్లో ఒక పాఠశాలను దత్తత తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నా కుమారుడు నాకంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. గతంలో కొవిడ్ సమయంలో రూ.10 కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించామని , మహారాష్ట్ర కర్ణాటకల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపా. తాము మాటలు చెప్పమని, చేసి చూపిస్తామన్నారు
కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజు రెడ్డి, పోచయ్య, గోపాల్ నాయక్, నరసమ్మ, నాయకులు సురేందర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావు, ఏకే యాదవరావు, రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ జీవన్, మేడి గణేష్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు నాయకులు పాల్గొన్నారు