Tamil nadu | తమిళనాడులో భారతీయ జనతా పార్టీ( BJP )కి భారీ షాక్ తగిలింది. గత వారం బీజేపీకి చెందిన ఐదు మంది కీలక నేతలు అన్నాడీఎంకే(AIADMK ) తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 13 మంది అన్నాడీఎంకే గూటికి చేరారు. దీంతో తమిళనాడు బీజేపీలో తీవ్ర గందరగోళం నెలకొంది.
గత వారం బీజేపీ స్టేట్ ఐటీ వింగ్ చీఫ్ సీఆర్‌టీ నిర్మల్ కుమార్( CRT Nirmal Kumar ) తో పాటు మరో నలుగురు బీజేపీని వీడగా, ఆయనకు మద్దతుగా ఐటీ వింగ్( BJP IT Wing )లో పని చేసే మరో 13 మంది కీలక నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా అన్నాడీఎంకే చీఫ్ ఈ పళనిస్వామి( E Palaniswamy ) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారందరికీ పళనిస్వామి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీ బలోపేతం కోసం ఎంతో కాలం పని చేస్తున్నామని నిర్మల్ కుమార్ తెలిపారు. తాము ఎలాంటి పదవులు ఆశించలేదని, గత కొన్ని రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బాధను కలిగించాయి. బీజేపీలోని కొంత మంది నాయకులు డీఎంకే మంత్రులతో రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అలాంటి నాయకుల ప్రవర్తన నచ్చకే బీజేపీని వీడి అన్నాడీఎంకేలో చేరామని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే ఘోర పరాజయం..
2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికలన్నింటిలోనూ బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఒంటరిగానే బరిలో దిగి ఓడిపోయింది.
బీజేపీ ఎదుగుతున్నందుకే..
తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నందుకే ఆయా పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు బీజేపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నాని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే అన్నమలై తెలిపారు. అన్నాడీఎంకేతో పాటు ఇతర పార్టీలకు బీజేపీ భయం పట్టుకుందన్నారు.