విధాత: ఒక సినిమా హిట్ కావడానికి కంటెంట్ మాత్రమే కాదు విడుదల చేసే టైమింగ్ కూడా చాలా ముఖ్యమని ఎన్నోసార్లు నిరూపితం అయింది. మంచి టైం లో వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్లుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. రాంగ్ టైంలో వస్తే హిట్ సినిమాలు కూడా దారుణమైన డిజాస్టర్లుగా.. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలలాడిన సందర్భాలు కోకొల్లలు.
‘కార్తికేయ 2’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ వెంటనే నిఖిల్ నటించిన ‘18 పేజెస్’ సినిమాపై బాగా బజ్ ఏర్పడింది. కంటెంట్ కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీయడంలో దర్శకుడు సూర్య ప్రతాప్ తడబడ్డాడు. ముఖ్యంగా ఏ సెంటర్స్, క్లాస్ ఆడియన్స్‌ని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
కానీ బీ,సీ సెంటర్స్‌లో మాస్ జనాలలో ఈ సినిమా సరిగా పెర్ఫామ్ చేయలేకపోతోంది. సినిమాకి నాన్ థియేట్రికల్ హక్కులను కలుపుకొని మొత్తం పెట్టుబడి వచ్చేసిందని నిర్మాతలైన గీతా ఆర్ట్స్2 అధినేత బన్నీ వాసు అంటున్నాడు. కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని చెప్పడం అనేది సరికాదు.
థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్లకు చేసిన బిజినెస్, టికెట్ల రూపంలో వసూళ్ల మొత్తం మాత్రమే పరిగణనలోకి వస్తుంది. ఇక సినిమా టాక్ విషయం పక్కన పెడితే.. రాంగ్ టైం లో రిలీజ్ చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. రవితేజ ధమాకా సినిమాకి నేరుగా పోటీకి వెళ్లడం మాస్ ఆడియన్స్ పరంగా దెబ్బకొట్టింది.
ధమాకాకి హిట్ టాక్ రానప్పటికీ మాస్ ఎలిమెంట్స్ ఉండడం, శ్రీ లీల గ్లామర్ బాగా ఉపయోగపడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘18 పేజెస్’ కంటే ‘ధమాకా’ డామినేషన్ కనిపిస్తోంది. 18 పేజెస్ సినిమాపై జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వీకెండ్లో సత్తా చాట లేక పోయింది. ఇక వీక్ డేస్‌లో ఏమాత్రం పర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి.
ధమాకాకి నేరుగా పోటీకి రాకుండా కాస్త అటు ఇటుగా ఓ వారం తర్వాత అంటే డిసెంబర్ 30, 31 తేదీల్లో వచ్చి ఉంటే జనవరి 12 లోపుగా అంటే సంక్రాంతి పోటీ ముందుగానే రెండు వారాల గ్యాప్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టేదని అంటున్నారు.
అందులో న్యూ ఇయర్ అంటే ప్రేమ జంటలు బాగా సినిమాలను చూస్తాయి. అలాంటి సమయంలో ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే వారిని బాగా మెప్పించి ఉండేది. అటూ ఇటూ గాని సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం పెద్ద మైనస్ గా కనిపిస్తోంది.
ఈ చిత్రం కనుక మంచి హిట్ అయి ఉంటే అది నిఖిల్ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ‘స్పై’కి బాగా హెల్ప్ అయ్యేది. కానీ డైరెక్టర్ సూర్య ప్రతాప్ టేకింగ్ మరీ క్లాస్‌గా ఉండటం, సుకుమార్ రచయితగా తనదైన క్లాసిక్ టచ్ ఇవ్వడంతో ఈ సినిమా ఓన్లీ క్లాస్ మూవీ గానే పేరు తెచ్చుకుని కలెక్షన్లలో మాత్రం వీక్ అయిపోయింది.