TITAN | Greece Boat Disaster గత పది రోజుల్లో సముద్రంలో జరిగిన రెండు విషాదాలు ప్రపంచ దృష్టిని అతిగా ఆకర్షించాయి. మొదటిది: 750 మంది శరణార్థులను తీసుకుపోతున్న చేపల నావ గ్రీకు సముద్రంలో మునిగిపోయిన సంఘటన. పేదరికాన్ని, హింసను తప్పించుకొని మంచి జీవనాన్ని జీవించాలన్న కోరికతో యూరప్ తీరానికి చేరాలన్న ఓ నిస్తేజ పూరిత ప్రయాణం ఈ శరణార్థులది. కారణాలు ఏవైనా గానీ.. సముద్రాన్ని దాటించటం కోసం అక్రమ రవాణాదారులకు ఈ శరణార్థులు ఎంతో కొంత […]

TITAN | Greece Boat Disaster

గత పది రోజుల్లో సముద్రంలో జరిగిన రెండు విషాదాలు ప్రపంచ దృష్టిని అతిగా ఆకర్షించాయి.

మొదటిది:

750 మంది శరణార్థులను తీసుకుపోతున్న చేపల నావ గ్రీకు సముద్రంలో మునిగిపోయిన సంఘటన. పేదరికాన్ని, హింసను తప్పించుకొని మంచి జీవనాన్ని జీవించాలన్న కోరికతో యూరప్ తీరానికి చేరాలన్న ఓ నిస్తేజ పూరిత ప్రయాణం ఈ శరణార్థులది. కారణాలు ఏవైనా గానీ.. సముద్రాన్ని దాటించటం కోసం అక్రమ రవాణాదారులకు ఈ శరణార్థులు ఎంతో కొంత ముట్టచెప్పారు కూడా. అయితే ఆ నాసి రకం నావలో పరిమితికి మించిన శరణార్థులు ఎక్కినందున ఆ నావ మునిగిపోయింది. 646 మంది చనిపోగా, కేవలం 104 మంది మాత్రం బతికి బట్టకట్టారు. వీరిలో అత్యధికులు బాలలు.

రెండవది:

ఈ ఘటన తర్వాత అతికొద్ది రోజులకు సంభవించిన రెండో దుర్ఘటన ఏమంటే (ఎన్నో దశాబ్దాల క్రితం మునిగిపోయి, సముద్ర గర్భంలో నిక్షిప్తంగా ఉన్న) టైటానిక్ ఓడ శిథిలాలను తమకు తాముగా చూడడానికి వెళ్లిన ఐదుగురు సంపన్నుల బృందాన్ని తీసుకెళ్లిన 'టైటాన్' అనే ఓ చిన్న జలాంతర్గామి అగాధ జలాల్లో ఆచూకీ కోల్పోవటం!

భూఉపరితలం నుంచి టైటాన్ తో సాంకేతిక, సమాచార సంబంధాలు తెగిపోయిన మరుక్షణం నుంచే ఆ జలాంతర్గామిని వెతకటానికి, ఆ ఐదుగురు సంపన్నులను రక్షించటానికి కావలసిన ప్రయత్నాలు ముమ్మరం కాబడ్డాయి. వీరిని రక్షించటానికి ప్రయత్నాలు చేసే రక్షణ బృందాలకు ఆర్థిక, మానవ వనరులను అనేక దేశాలకు చెందిన అనేక సంస్థలు చిటికెలో సమకుర్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు ఈ వార్తకు సంబంధించిన విశేషాలను క్షణక్షణం ప్రజలకు అందించాయి. అంతేకాక, వీరిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ వచ్చాయి. అంతేగాక ఈ మీడియా సంస్థలు ఆగమేఘాల మీద ఈ సంపన్నుల పేర్లను గుర్తించాయి. వారి సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని ప్రపంచానికి ప్రసారం చేశాయి. కింగ్ చార్లెస్ వంటి శిస్టులతో వారికున్న సంబంధాలను కథలు కథలుగా గంటల కొద్దీ ప్రచారం చేశాయి.

కానీ.. చేపల పడవలో ప్రయాణం చేసిన ఆ 750 మంది శరణార్థుల వివరాలు ఎవరికీ తెలియవు. వారు అనామకులు. ఆ శరణార్థుల పేర్ఎలేంటో, వాళ్లేవరో, ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు. వీరి గురించి ఎవరికీ పట్టింపు లేదు. వారంతా ప్రభుత్వాలకు అనామకుల కింద లెక్క. మునిగిన ఆ శరణార్థుల నావను వెతికే ప్రయత్నమే చేయలేదు. వారిని రక్షించాలన్న కనీస ప్రయత్నం ఏ ఒక్క దేశం గానీ, ఏ ఒక్క సంస్థ గానీ చేయలేదు. వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఒక్కరు మాత్రమే 'ఆ శరణార్థులు ఎందుకు రక్షించబడలేదని' ఆవేదన చెందారు.

ఐదు.. ప్రతిగా ఏడు వందల యాభై

ఈ ఘటనలు రెండూ ఎవరి జీవనాలు ముఖ్యమో, విలువైనవో స్పష్ట పరిచాయి. ఈ రెండు దుర్ఘటనల్లోనూ మరణించిన వారు మనుషులే.. అయినప్పటికీ, వారి వారి జీవితాల విలువలు మాత్రం రకరకాలుగా లెక్క కట్టబడుతున్నాయి.

ప్రస్తుతం జలాంతర్గామి మునకకు సంబంధించిన 'విపత్తు ప్రేరణ' (catastrophic implosion) పై , భవిష్యత్తులో అట్టి దుర్ఘటనలను నివారించేందుకు గల మార్గాలపై చాలా లోతైన అధ్యయనం శరవేగంగా జరిగిపోతోంది. మరింత కటినతరమైన సురక్షిత మార్గాలు, వాని ప్రక్రియల విషయంలో బోలెడంత చర్చ నడుస్తోంది.

కానీ.. దీనికి ప్రతిగా శరణార్థులను తీసుకుపోతూ మునిగిపోయిన చేపల నావను గూర్చిన విశ్లేషణలే లేవు. అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోదగు నివారణ చర్యలపై చర్చలు లేవు. ఏ ఒక్కరూ కనీసం పట్టించుకోను కూడా లేదు. శరణార్థుల నావలు గతంలో అసంఖ్యాకంగా మునిగిపోయి, లెక్కలేనంత మంది సామాన్యులు, పసిపిల్లలు మృత్యువాత బడ్డ దుర్ఘటనలు గత దశాబ్దాల్లో అనేకం. కానీ, ఇట్టి విపత్తులు మరల మరల సంభవించకుండా చేయదగిన నివారణ చర్యల గూర్చిన ఆలోచన, ఆసక్తి ఏ ఒక్కనికీ లేదు.

ఐదు - ప్రతిగా - ఏడు వందల యాభై!,
పేదలు - ప్రతిగా - ధనికులు!,
దురాశావహులు - ప్రతిగా - నిరాశావహులు!
తరతమ బేధాలు లేకుండా ఏ ఒక్కర్నీ మిగల్చకుండా అందర్నీ సంద్రం మింగేసింది.

కానీ.. మనిషి మాత్రం - చదువు, సంపద, సామాజిక హోదా, సామాజిక సంబంధాల ప్రాతిపదికన విలువ కట్టబడుతూ, కొలవబడుతూ అమలు చేయకూడని అసంబద్ధ తేడాలను మనిషికి మనిషికి మధ్య అనేక రకాలుగా సృష్టిస్తూ మనుగడ సాగిస్తున్నాడు. మానవ జీవన విధానానికిది మాత్రం చాలా దురదృష్టకర పరిణామం.

Updated On 28 Jun 2023 12:13 PM GMT
krs

krs

Next Story