Kerala | కేరళలో ఘోర ప్రమాదం సంభవించింది. హౌస్‌బోట్ పడవ బోల్తా పడటంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మలప్పురం జిల్లా తనూర్ ఏరియాలోని తవల్ తీరం బీచ్ వద్ద ఓ 30 మంది హౌస్ బోట్ ఎక్కారు. బోట్ కదిలిన కాసేటికే.. ఆ పడవ బోల్తా పడింది. దీంతో చాలా మంది బోటు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కేరళ క్రీడల శాఖ మంత్రి వీ అబ్దురహీమాన్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది చనిపోయారని తెలిపారు. మరో 10 మందిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని స్పష్టం చేశారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉందని క్రీడల మంత్రి చెప్పారు.
ప్రధాని మోదీ, సీఎం విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని.