Royal Enfield Bullet 350 | విధాత: బైకులన్నీ ఒక ఎత్తు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక ఎత్తు! అదీ బుల్లెట్ స్పెషల్! 350 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై డుగ్గుడుగ్గు అని దూసుకుపోతుంటే.. ఆ మజా కిక్ ఇక్కిస్తుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడు పోయే బైక్స్‌లో బుల్లెట్ ఒకటి. అందుకే.. ‘జనాల్లో రెండు రకాల వారు ఉంటారు.. ఒకరు బుల్లెట్ నడిపే వారు.. మరొకరు బుల్లెట్ నడపాలని అనుకునేవారు..’ అని అంటుంటారు. అలా నడపాలని కోరుకునేవారికి 2023 […]

Royal Enfield Bullet 350 |
విధాత: బైకులన్నీ ఒక ఎత్తు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక ఎత్తు! అదీ బుల్లెట్ స్పెషల్! 350 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై డుగ్గుడుగ్గు అని దూసుకుపోతుంటే.. ఆ మజా కిక్ ఇక్కిస్తుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడు పోయే బైక్స్‌లో బుల్లెట్ ఒకటి. అందుకే.. ‘జనాల్లో రెండు రకాల వారు ఉంటారు.. ఒకరు బుల్లెట్ నడిపే వారు.. మరొకరు బుల్లెట్ నడపాలని అనుకునేవారు..’ అని అంటుంటారు.
అలా నడపాలని కోరుకునేవారికి 2023 కొత్త అవతారంలో బుల్లెట్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిచయం చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇప్పుడు జే సిరీస్ ప్లాట్‌ఫాం ఆధారితం. డొమెస్టిక్ మార్కెట్‌తో పాటు.. దశలవారీగా యూరప్, ఆసియా పసిఫిక్, అమెరికా దేశాల్లోనూ విస్తరిస్తున్నది రాయల్ ఎన్‌ఫీల్డ్.
ధర ఎంతంటే..
బుల్లెట్ 350 మూడు వేరియంట్లలో.. మిలిటరీ, స్టాండర్డ్, బ్లాక్.. లభిస్తున్నది. ఎక్స్‌షోరూం ధరలు చూస్తే.. మిలిటరీ వేరియంట్ రూ.1,73,562, స్టాండర్డ్ వేరియంట్ రూ.1,97,436, బ్లాక్‌గోల్డ్ రూ.2,15,801కు లభిస్తుంది.
ఇదీ ఇంజిన్ పరిస్థితి..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొత్త జే-సిరీస్ ఆధారితంగా తీసుకువచ్చారు. 349 సీసీ, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లోని ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో ఉంటుంది. 20.2 బీపీహెచ్, 27ఎన్‌ఎంతో 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.
మైలేజీ విషయానికి వస్తే..
క్లాసిక్ 350కి ఇచ్చే 36.2 (నిర్దేశిత ప్రమాణాలలో) కేఎంపీఎల్‌ను కొత్త బుల్లెట్‌కు కూడా ఉంటుందని తెలుస్తున్నది. కొత్త బుల్లెట్.. ముందు ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్‌లను, వెనుక జంట షాక్స్ ఉంటాయి. స్పోక్స్ వీల్స్ (19 అంగుళాలు ముందర, 18 అంగుళాలు వెనుక) కలిగి ఉంటుంది. డ్యూయల్ చానల్ ఏబీఎస్‌తో ముందు 300 ఎంఎం డిస్క్, వెనుక 270 ఎంఎం డిస్క్ ఉంటాయి.
లభించే రంగులు
రంగుల విషయానికి వస్తే.. మిలిటరీ వేరియంట్‌లో బ్లాక్, రెడ్ ఆప్షన్లు ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌లో బ్లాక్, మెరూన్ ఆప్షన్లు ఇచ్చారు. బ్లాక్ వేరియంట్‌లో గోల్డ్ ఆప్షన్ ఉన్నది. కొత్త ఇంజిన్, చాసిస్‌తో వస్తున్న బుల్లెట్‌లో కొత్తగా డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది తొలిసారి ప్రవేశపెట్టారు. సీట్ కొత్తగా ఉంటుంది. రోటరీ స్విచ్‌గేర్ అనేది కొత్త ఫీచర్. మొబైల్ ఫోన్లు చార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉన్నదండోయ్!
