Smart Phone | ఓ ప్రభుత్వ అధికారి మితిమీరిన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. రూ. లక్ష విలువ చేసే స్మార్ట్ ఫోన్ రిజర్వాయర్‌లో పడిపోవడంతో.. దాన్ని ఆచూకీ కనుగొనేందుకు ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని ఖాళీ చేయించాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో రాజేశ్ విశ్వాస్ అనే వ్యక్తి ఫుడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల తన స్నేహితులతో కలిసి.. స్థానికంగా ఉన్న ఖేర్ కట్టా డ్యామ్ సందర్శనకు వెళ్లారు.
డ్యామ్ వద్ద విశ్వాస్ తన ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీ దిగుతుండగా తన స్మార్ట్ ఫోన్(రూ. 96 వేలు) నీటిలో పడిపోయింది. ఆ ఫోన్‌లో అధికారిక సమాచారం ఉండటంతో ఆందోళనకు గురైన విశ్వాస్.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాడు. 15 అడుగుల లోతైన నీళ్లలో ఎంత గాలించినా ఫోన్ ఆచూకీ లభించలేదు.
ఇక జల వనరుల విభాగం అధికారికి సమాచారం ఇవ్వడంతో.. రెండు భారీ మోటార్లను ఉపయోగించి, 21 లక్షల లీటర్ల నీటిని డ్యామ్ నుంచి బయటకు తోడేశారు. సోమవారం నుంచి గురువారం వరకు మోటార్లు నడిచాయి.
ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జల వనరుల విభాగం ఆ ప్రక్రియను నిలిపివేసింది. చివరకు ఆ ఫోన్‌ను వెతికి తీసినప్పటికీ అది పని చేయడం లేదని తేలింది. ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించి, ఫుడ్ ఆఫీసర్ విశ్వాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
డ్యాం నుంచి బయటకు తోడిన నీటితో 1500 ఎకరాల భూమి సాగయ్యేదని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే ఐ ఫోన్ కోసం 21 లక్షల లీటర్ల నీటిని తోడేయడం సరియైంది కాదు అని రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు.