విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆస్పత్రిలో ఒక్క రోజులో 25 ప్రసవాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా గర్భిణుల కోసం ఎంసీహెచ్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రసవాల కోసం ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో 24గంటల్లో 25 ప్రసవాలు చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు ఒక్క రోజులోనే 25 ప్రసవాలు జరిగాయి. అందులో 12 సాధారణ ప్రసవాలు కాగా, 13 సిజేరియన్ చేశారు.
ముఖ్యంగా ఆసుపత్రి విభాగ అధిపతి గైనకాలజిస్ట్ డా శివదయాల్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ డా వసుధ, అనస్థీషియా సాగరిక,. పిల్లల వైద్య నిపుణులు డా చంద్రశేఖర్ రావు, స్టాప్ నర్సులు, నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్, వైద్యసిబ్బంది 24 గంటలు శ్రమించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రసవాలు చేశారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్ తెలిపారు.
ఆసుపత్రిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఒక్కరోజులో 23 ప్రసవాలకు మించి జరగలేదని, ఒకే రోజు 25 ప్రసవాలు జరగడం ఆసుపత్రి రికార్డుగా పేర్కొన్నారు. ఏంసీహెచ్ లో ఇది ప్రథమం. 25 ప్రసవాల్లో 17 మంది మగ పిల్లలు, 8 మంది ఆడపిల్లలు జన్మించినట్లు తెలిపారు.