Saturday, April 1, 2023
More
  Homeతెలంగాణ‌Medak: మహిళా సంఘాలకు రూ.3.78కోట్ల చెక్కు పంపిణీ

  Medak: మహిళా సంఘాలకు రూ.3.78కోట్ల చెక్కు పంపిణీ

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న‌ ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి

  విధాత, మెదక్ బ్యూరో: మెదక్ నియోజక వర్గానికి చెందిన మహిళా సంఘాల (women’s associations)కు 3కోట్ల 78 లక్షల రూపాయలు విలువగల చెక్కులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (MLA Padma Devendar reddy) పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ (Womens day) సందర్భంగా బుధవారం స్థానిక సాయి బాలాజీ గార్డెన్ (Balagi Garden)లో డీఆర్డీవో(DRDO) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు క్రమం తప్పకుండా బ్యాంకులకు రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకుల మన్ననలు చూరగొన్నాయ‌ని, నేడు బ్యాంకులను నడిపిస్తున్న గౌరవం మనకే దక్కిందని ఆమె అన్నారు.

  మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఉత్పాదక, అను ఉత్పాదక అనే రెండు రంగాలలో ఉత్పాదక రంగంలో రాణిస్తే దేశం పురోగమిస్తుందని అన్నారు. నేటి దైనందిక జీవితంలో ఖర్చులు పెరిగి భార్యా భర్తలు ఇరువురు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినదని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. పురుషులు, సమాజం మహిళలను ముందుకు నడ‌వ‌డంలో ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు.

  ప్రభుత్వాలు ఆదాయ వ్యయాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందిస్తుంటే, మహిళలు తమ భర్త ఇచ్చిన సంపాదనను ఒక ఆలోచనతో క్రమ పద్ధతిలో ఖర్చు పెడుతూ పొదుపు చేస్తున్నార‌ని, వారి నుంచి నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని అన్నారు. మహిళలు ఎక్కడ పూజింపబడుతారో అక్కడ దేవతలు నడయాడుతారని, కాబట్టి పురుషులతో పాటు సమానంగా మహిళలను గౌరవిస్తూ అన్ని రంగాలలో వారికి అవకాశాలు ఇచ్చి ఎదగనివ్వాలని కోరారు.

  ఆడపిల్లలను బాగా చదివించాలని, వారు ఆర్థికంగా నిలదొక్కుకొని స్వావలంబన సాధించిన నాడే వివాహాలు చేయాలని, తద్వారా ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొనే మనో స్థైర్యం, ధైర్యం వస్తుందని అన్నారు. ఆడ పిల్లలను బతికించండి -బతకనివ్వండని కోరారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. ప్రభుత్వం కూడా మహిళలను ప్రోత్సహిస్తున్నదని గర్భిణులకు త్వరలో న్యూట్రిషన్ కిట్లు అందజేయనుందని అందజేస్తున్నదని అన్నారు.

  మహిళలకు ప్రత్యేకించి 8 రుగ్మతలకు సంబంధించి వైద్య సదుపాయాలు కల్పించుటకు నేటి నుండే జిల్లాలో ఎంపిక చేసిన ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా పేర‌ మహిళా క్లీనిక్‌లు ఏర్పాటు చేసుకుంటున్నామని, వాటికి అనుసంధానంగా జిల్లా ఆసుపత్రిలో రెఫరల్ కేంద్రాన్ని ప్రారంభించానని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  అనంతరం 10,749 స్వయం సహాయక సంఘాలకు 2018-19, 2019-20సంవత్సరాలకు సంబంధించి వడ్డీ లేని రుణ బకాయిలు 38,35,43,000 రూపాయల చెక్కును, మెప్మా ద్వారా 568 సంఘాలకు 3 కోట్ల 79 లక్షల చెక్కును అందజేశారు. ఇందులో మెదక్ నియోజక వర్గానికి సంబంధించి 3601 స్వయం సహాయక సంఘాలకు 13,96,46,000 ఉన్నాయి. కాగా బ్యాంకు లింకేజి కింద‌ 374 మహిళా సంఘాలకు 27,08,35,000 రూపాయల చెక్కును అందజేశారు.

  జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహిళలు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నది. ఇట్టి రుణాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకు లింకేజి, రుణాలు అందించడంలో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నదని, మహిళలు కూడా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నారని కితాబిచ్చారు. మహిళ బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, పిల్లలను చక్కగా చదివించాలని సూచించారు.

  అనంతరం బ్యాంకు లింకేజి, రుణాల పంపిణీలో ప్ర‌తిభ‌ కనబరచి లక్ష్యాలను అధిగ‌మించి మండల సమాఖ్యలకు, ఏ.పి .ఏం.లకు, స్త్రీ నిధి సహాయ మేనేజర్లను, వి.ఏ.ఓ. లను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని సన్మానించారు.

  కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బట్టి జగపతి, టి యన్ జి ఓస్ అధ్యక్షులు నరేందర్, డిఆర్ డిఓ శ్రీనివాస్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, మునిసిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular