మణిపూర్ పోలీసులకు ఆదేశాలు Manipur | న్యూఢిల్లీ: మణిపూర్ పోలీసుల నుంచి అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్న నిజనిర్ధారణ కమిటీకి సుప్రీం కోర్టు రక్షణ కల్పించింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు అంగీకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్, ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అరెస్టు చేసేందుకు మణిపూర్ పోలీసులు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాదనలను వివరంగా వింటామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని […]

- మణిపూర్ పోలీసులకు ఆదేశాలు
Manipur | న్యూఢిల్లీ: మణిపూర్ పోలీసుల నుంచి అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్న నిజనిర్ధారణ కమిటీకి సుప్రీం కోర్టు రక్షణ కల్పించింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు అంగీకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్, ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అరెస్టు చేసేందుకు మణిపూర్ పోలీసులు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాదనలను వివరంగా వింటామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంటూ విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. ఈలోపు వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని మణిపూర్ పోలీసులను నిర్దేశించింది.
ఎడిటర్స్ గిల్డ్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ మౌఖికంగా వాదనలు వినిపిస్తూ.. మణిపూర్ ఘటనలపై ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ సెప్టెంబర్ 2న నివేదిక విడుదల చేసిన తర్వాత కనీసం రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన విషయాన్ని ప్రస్తావించారు. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సీమా ముస్తఫా, మరో ముగ్గురు జర్నలిస్టులు సంజయ్ కపూర్, సీమా గుహ, భరత్ భూషణ్‌పై ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారన్న అభియోగం కూడా ఉన్నది. ఎడిటర్స్ గిల్డ్ నివేదిక సరైంది కాదని, తప్పుడు స్టేట్‌మెంట్స్‌తో కూడినదని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.
అయితే.. ఈ నివేదిక ఆగస్ట్ ఏడు నుంచి పది వరకూ ఎంతో శ్రమకోర్చి, ఎంతో దూరం ప్రయాణించి, అనేక మందిని ఇంటర్వ్యూ చేసి రూపొందించినదని దివాన్ తెలిపారు. నివేదిక విడుదల తర్వాత మణిపూర్ సీఎం బీరేన్‌సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎడిటర్స్ గిల్డ్.. ఆయన మాటలు భావ ప్రకటన స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నది. ఎడిటర్స్ గిల్డ్ భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నదని మీడియా సమావేశంలో ఆరోపించిన తర్వాత ఈ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు కావడం గమనార్హం.
