Tuesday, January 31, 2023
More
  Homelatest40 ఏండ్ల క్రితం.. ఇదే రోజున సీఎంగా ప్ర‌మాణం చేసిన ఎన్టీఆర్..

  40 ఏండ్ల క్రితం.. ఇదే రోజున సీఎంగా ప్ర‌మాణం చేసిన ఎన్టీఆర్..

  Nandamuri Taraka Ramarao | తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిన‌పోయిన నంద‌మూరి తార‌క రామారావు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇదే తేదీన స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించారు. తెలుగువాడి ఆత్మ‌గౌర‌వ‌మే ధ్యేయంగా ఎన్టీఆర్ ఆధ్వ‌ర్యంలో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఢిల్లీ నియంత పాల‌నకు చ‌ర‌మ‌గీతం పాడింది. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్.. కేవ‌లం 9 నెల‌ల పాటు రాష్ట్ర‌మంతా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు.

  1983, జ‌న‌వ‌రి 5న వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజ‌యం సాధించింది. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా పాల‌న సాగించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించి.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. 1983, జ‌న‌వ‌రి 8న టీడీపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎన్టీఆర్ ఎన్నిక‌య్యారు. జ‌న‌వ‌రి 9వ తేదీన నంద‌మూరి తార‌క రామారావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ అపూర్వ ఘ‌ట్టానికి హైద‌రాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం వేదికైంది. తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన అపూర్వ ఘ‌ట్టానికి నేటితో నాలుగు ద‌శాబ్దాలు పూర్త‌య్యాయి.

  1983 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ.. రాజ‌కీయాల్లో యువ‌త‌కు, విద్యావంతుల‌కు పెద్ద‌పీట వేసింది. నాటి ప్ర‌భుత్వంలో 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్ట‌ర్లు, 47 మంది లాయ‌ర్లు, 8 మంది ఇంజినీర్లు, 125 మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఉన్నారు.

  అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్టీఆర్ విద్యా రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. 1985లో తెలుగు విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు చేశారు. తిరుప‌తిలో మ‌హిళా యూనివ‌ర్సిటీ, దేశంలోనే తొలిసారిగా ప్ర‌త్యేక వైద్య విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్నా భోజ‌నం ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు. ఇక సంక్షేమంపై కూడా దృష్టి సారించారు. 1983 ఏప్రిల్ 14న‌(ఉగాది) రెండు కిలోల బియ్యం ప‌థ‌కాన్ని ప్రారంభించారు. వృద్ధుల‌కు, వితంతువుల‌కు పెన్ష‌న్ల ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. మ‌హిళ‌ల‌కు ఆస్తిలో స‌మాన హ‌క్కు క‌ల్పిస్తూ చ‌ట్టం చేశారు. దేశంలో అలాంటి చ‌ట్టాన్ని తొలిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే చేసింది. ఆ త‌ర్వాత 20 ఏండ్ల‌కు కేంద్రం అలాంటి చ‌ట్టాన్ని తెచ్చింది.

  ఎన్టీఆర్ మంత్రి మండ‌లి ఇదే..

  నంద‌మూరి తార‌క రామారావు – ముఖ్య‌మంత్రి, హోం, ప‌రిపాల‌న‌, భారీ ప‌రిశ్ర‌మ‌లు
  నాదెండ్ల భాస్క‌ర్ రావు – ఆర్థిక‌, ఇంధ‌న‌
  మ‌హేంద్ర‌నాథ్ – రెవెన్యూ, పౌర‌స‌ర‌ఫ‌రాలు
  న‌ల్ల‌పురెడ్డి శ్రీనివాసులు రెడ్డి – నీటి పారుద‌ల‌
  కుందూరు జానారెడ్డి – వ్య‌వ‌సాయం
  ఎస్ రామ‌ముని రెడ్డి – వైద్యారోగ్య శాఖ‌
  క‌ర‌ణం రామ‌చంద్ర‌రావు – పంచాయ‌తీరాజ్
  య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు – న్యాయ‌, మున్సిప‌ల్
  ఎస్. స‌త్య‌నారాయ‌ణ – ర‌వాణా
  పూస‌పాటి ఆనంద‌గ‌జ‌ప‌తి రాజు – ఎడ్యుకేష‌న్
  ఎం రామ‌చంద్ర రావు – కార్మిక, ఉపాధి
  జీవ‌న్ రెడ్డి – అబ్కారీ
  ఈలి ఆంజ‌నేయులు – దేవాదాయ‌
  కావలి ప్ర‌తిభా భార‌తి – సాంఘిక సంక్షేమం
  మ‌హ్మ‌ద్ ష‌కీర్ – ప‌ర్యాట‌కం, వ‌క్ఫ్‌

   

   

   

   

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular