Telangana | ఉండాల్సిన బోధనా సిబ్బంది 2,825 విధి నిర్వహణలో ఉన్నది 873 మందే వెయ్యికి పైగా ఖాళీల భర్తీకి ఆర్థిక అనుమతి ఏడాదిగా చర్యలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణలే తప్ప నియామకాల్లేవు కుంటుపడుతున్న విద్య, పరిశోధనలు మరోవైపు ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు విధాత: రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 యూనివర్సిటీల్లో దాదాపు 60 శాతం వరకు టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వర్సిటీల్లో బోధన, బోధనేతర […]

Telangana |

  • ఉండాల్సిన బోధనా సిబ్బంది 2,825
  • విధి నిర్వహణలో ఉన్నది 873 మందే
  • వెయ్యికి పైగా ఖాళీల భర్తీకి ఆర్థిక అనుమతి
  • ఏడాదిగా చర్యలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం
  • పదవీ విరమణలే తప్ప నియామకాల్లేవు
  • కుంటుపడుతున్న విద్య, పరిశోధనలు
  • మరోవైపు ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు

విధాత: రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 యూనివర్సిటీల్లో దాదాపు 60 శాతం వరకు టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తున్నదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. యూనివర్సి టీల్లో వెయ్యికి పైగా అధ్యాపక ఖాళీల భర్తీ కోసం ఏడాది కిందటే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటి భర్తీ కోసం చర్యలు చేపట్టలేదు.

ఫలితంగా ఏటా పదవీ విరమణ చేస్తున్న వారే తప్ప.. కొత్త నియామకాలు లేకుండా పోయాయి. దీంతో వర్సిటీల్లో పరిశోధనలు, విద్య కుంటుపడ్డాయి. మరోవైపు ప్రభుత్వం ప్రైవేట్‌ వర్సిటీలకు అనుమతులు ఇస్తూ.. ప్రభుత్వ పరిధిలోని వర్సిటీల్లో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయల కల్పన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రస్తుతం 11 విశ్వవిద్యాలయాల్లో 2,825 మంది బోధనా సిబ్బందికి బదులు 873 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

ఆ బిల్లు ఆమోదం పొందదు!

విద్యావేత్తలు, నిరుద్యోగుల ఒత్తిడితో ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను కామన్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామని చెప్పి, దానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదించింది. ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఆ బిల్లులోని అంశాలు ఉన్నాయని గవర్నర్‌ ఆ బిల్లును ఆమోదించలేదు. ఇది సాధ్యం కాదని అనుకున్నప్పుడు గతంలో మాదిరిగానే యూనివర్సిటీల వారీగానే భర్తీకి అనుమతి ఇవ్వనున్నారనే వార్తలు వచ్చాయి. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి కానీ.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

పెంపు 65 ఏళ్లా 62 ఏళ్లా?

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును ప్రభుత్వం పెంచింది. ప్రస్తుత రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లు ఉండగా.. దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచినప్పుడే యూనివర్సిటీల్లోని ఆచార్యుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయి. అయితే ఏడాదిన్నర కిందట వారి పదవీ విరమణ వయసు పెంచడం లేదని ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చింది.

ఇటు కామన్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు అమల్లోకి రాక, అటు కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతించక పోవడంతో వర్సిటీలన్నీ సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి. ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేస్తూ.. సుదీర్ఘ పరిశోధనా అనుభవం ఉన్న ఆచార్యులు విద్యార్థులకు తమ సేవలు అందిస్తామంటున్నారు. ప్రభుత్వం పదవీ విరమణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొంతమంది సెంట్రల్‌ యూనివర్సిటీలకు వెళ్లారు.

ప్రైవేట్‌ వర్సిటీలు కూడా ఆచార్యుల వయసు 65 ఏళ్లకు పెంచి వారి అనుభవాలను వినియోగించుకుంటు న్నాయి. ప్రభుత్వం మాత్రం వీరి సేవలు వినియోగించుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నదో అర్థం కావడం లేదని అధ్యాపక సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆచార్యుల వయసు 60 ఏళ్లుగా ఉన్నది.

అయితే విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు తగ్గిపోతున్న దృష్ట్యా.. పదవీ విమరణకు మూడేళ్ల ముందు గైడ్‌ షిప్‌ తీసుకోవద్దనే నిబంధనలు ఉండటంతో రిటైర్మెంట్‌ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వీటన్నింటి నేపథ్యంలో యూనివర్సిటీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

దీనికి సంబంధించిన ఆ ఫైలును సీఎం పరిశీలన కోసం విద్యాశాఖ పంపిందని సమాచారం. దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వైద్య విద్యలో అధ్యాపకుల వయసు 65 ఏళ్లకు పెంచినట్టు విశ్వవిద్యాలయ ఆచార్యుల వయసు కూడా 65 ఏళ్లకు పెంచుతారా? లేక 62 ఏళ్ల పెంపునకే ఆమోదముద్ర వేస్తారా అన్నది వేచి చూడాలి.

విద్యపై నిర్లక్ష్యం

మూడేళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 61కి పెంచింది. దీనివల్ల నిరుద్యోగులకు చాలా నష్టం జరుగుతుందని చాలామంది ఆ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయినా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా వచ్చేవారి సగటు వయసు 30 ఏళ్లు ఉండేది. ప్రభుత్వం ఏటా టీచర్‌ ఖాళీలను భర్తీ చేయకపోవడం, విద్యాభివృద్ధి గురించి పట్టించుకోక పోవడంతో రాష్ట్రంలో డీ.ఎడ్‌, బీ.ఎడ్‌., పూర్తి చేసి డీఎస్సీ కోసం ఎదురు చూస్తన్న వారు లక్షల్లో ఉన్నారు.

2017 తర్వాత తాజాగా 5,089 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం టీఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పోస్టులు తక్కువగా ఉండటానికి ఉద్యోగుల పదవీ విరమణ పెంపు ఒక కారణమైతే.. చాలా ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలు లేకపోవడం మరో కారణమని తెలుస్తున్నది.

Updated On 13 Sep 2023 3:53 PM GMT
krs

krs

Next Story