Siddipeta |
ఇది హృదయ విదారక ఘటన.. ఓ 90 ఏండ్ల వృద్ధుడు తన చితి తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఎందుకంటే వంతుల జీవితం బతకడం ఇష్టం లేక ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య(90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదుగురికి వివాహాలు అయ్యాయి. కొన్నేండ్ల క్రితమే వెంకటయ్య భార్య చనిపోయింది. ఇక నలుగురు కుమారులు కూడా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఇద్దరు కుమారులు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో స్థిరపడ్డారు. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కూడా కుమారులకు పంచేశాడు వెంకటయ్య.
తనకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌తో వెంకటయ్య బతుకుతూ తన పెద్దకుమారుడు కనకయ్య ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఐదు నెలల క్రితం తండ్రి పోషణ గురించి కుమారుల మధ్య మనస్ఫర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో పెద్దమనషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఒక్కొక్కరు ఒక్కో నెల తండ్రిని పోషించాలని ఆ పంచాయితీలో నిర్ణయించారు.
ఇక పెద్ద కుమారుడు కనకయ్య నెల రోజుల పాటు పోషించాడు. ఇక రెండో కుమారుడు నవాబ్‌పేట (కరీంనగర్)లో ఉంటున్నాడు. అతని దగ్గరకు వెంకటయ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ సొంతూరిని వదిలి వెళ్లడం వృద్ధుడికి ఇష్టం లేదు.
అయితే ఈ నెల 2వ తేదీన పొట్లపల్లిలోని ఓ నాయకుడి ఇంటికి వెంకటయ్య వెళ్లి.. తన బాధను ఆయన వద్ద వెళ్లగక్కారు. ఆ రోజు రాత్రి నాయకుడి ఇంట్లోనే ఉన్నాడు. 3వ తేదీన ఉదయం లేచిన వెంటనే రెండో కుమారుడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి వెంకటయ్య బయల్దేరాడు. సాయంత్రం వరకు కూడా ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు.
గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వృద్ధుడు తమ తండ్రేనని వెంకటయ్య కుమారులు గుర్తించారు. తాటి కమ్మలను ఒక చోట కుప్పగా పేర్చి వాటికి నిప్పంటించి, అందులోకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.