Hyderabad | కుమారులిద్దరికీ మెదడు( Brain ) సంబంధిత వ్యాధులు.. ఒకరు పుట్టుకతోనే బుద్ధి మాంద్యంతో బాధపడుతుండగా, మరొకరికి ఇటీవలే బ్రెయిన్ క్యాన్సర్( Brain Cancer ) నిర్ధారణ అయింది. దీంతో ఆ ఇద్దరి బిడ్డల బాధలను చూడలేక దంపతులిద్దరూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు విషమిచ్చిన అనంతరం దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్( Hyderabad ) కుషాయిగూడ పోలీసు స్టేషన్( Kushaiguda Police ) పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా( Nizamabad Dist )కు చెందిన గాదే సతీశ్(39)కు సిద్దిపేట జిల్లా( Siddipeta Dist ) దౌల్తాబాద్‌కు చెందిన వేద(35)తో 11 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి నిషికేత్(9), నిహాల్(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కందిగూడలోని క్రాంతి పార్కు రాయల్ అపార్ట్‌మెంట్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. గాదే సతీశ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి( Software Employee ) కాగా, వేద గృహిణి. నిషికేత్ సైనిక్‌పురిలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. నిహాల్ పుట్టుకతోనే బుద్ధి మాంద్యంతో బాధపడుతుండటంతో స్థానికంగా ఉన్న ఆర్టిజం స్కూల్‌కు వెళ్తున్నాడు.
అయితే నిషికేత్‌కు రెండు నెలల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో అతన్ని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించగా, బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు పిల్లలకు మెదడు సంబంధిత వ్యాధులు రావడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కన్న బిడ్డలు పడుతున్న కష్టాన్ని చూడలేక కలిసికట్టుగా చనిపోవాలని నిర్ణయించుకున్నారేమో ఆ దంపతులు. ఇద్దరు పిల్లలకు పాలల్లో పొటాషియం సైనెడ్ కలిపి ఇచ్చారు. అనంతరం సతీశ్, వేద కూడా అదే సైనెడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సతీశ్, వేద ఫోన్లకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి బంధువులు వచ్చి చూడగా, బెడ్రూంలో విగతజీవులుగా పడి ఉన్న ఆ కుటుంబాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రశాంతంగా చావనివ్వండి..
‘మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ప్రశాంతంగా చావనివ్వండి.. మమ్మల్ని ఎవరూ బతికించే ప్రయత్నం చేయొద్దు’ అని రాసివున్న నోట్ బంధువులు, స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తోంది.