Crime News | Chhattisgarh
కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక కుటుంబ సభ్యులంతా కలిసి హుషారుగా డ్యాన్స్‌లు చేస్తున్నారు. పెళ్లి కుమారుడి తల్లి కూడా ఇతరులతో కలిసి స్టెప్పులేసింది. అనుమానంతో ఆమెపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నిందితుడి సోదరులు ఇద్దరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) కబీర్‌ధామ్ జిల్లా కవర్ధ పరిధిలోని బంగౌరా గ్రామానికి చెందిన తిన్హా బైగా అనే వ్యక్తి రెండు రోజుల క్రితం తన కుమారుడి వివాహం జరిపించాడు. సోమవారం రోజు కుటుంబ సభ్యులంతా కలిసి పెళ్లి మండపంలో డ్యాన్సులు చేశారు. ఇతరులతో కలిసి డ్యాన్స్ చేసిన భార్యపై తిన్హా బైగా కత్తి తీసుకొని దాడి చేశాడు.
ఈ దాడిని అడ్డుకునేందుకు తిన్హా సోదరులు, బావమరుదులు ప్రయత్నించారు. కానీ తిన్హా వారిపై కూడా కత్తితో విరుచుకుపడ్డాడు. దీంతో తిన్హా సోదరులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భార్య, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇక తిన్హా పెళ్లి మండపంలోనే హాయిగా నిద్ర పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు.