Nalgonda | ఇది హృదయ విదారక ఘటన.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధ దంపతులు.. మంచాన పడి కుమారుడికి భారమయ్యానే మనో వేదనతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అడ్లూరు గ్రామానికి చెందిన చిలుకూరి నర్సయ్య(75), భార్య లక్ష్మమ్మ(70) దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ముగ్గురికి వివాహాలు కాగా, కుమారుడు తన వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ నగరంలో సెటిలయ్యాడు. ఇక తమకున్న 10 ఎకరాల పొలాన్ని కౌలుకు ఇచ్చారు.
అయితే నర్సయ్య పక్షవాతంతో, లక్ష్మమ్మ మూత్రపిండాల జబ్బుతో గత కొంతకాలం నుంచి బాధపడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను చూసుకునేందుకు వారానికి ఒకసారి కుమారుడు అడ్లూరుకు వచ్చి వెళ్తుండేవాడు. మంచాన పడ్డ ఇద్దరం కుమారుడికి భారంగా మారామని ఆ దంపతులు తమ బంధువుల వద్ద వాపోయేవారు.
ఈ క్రమంలోనే జీవితం మీద విరక్తి చెందిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తెల్లారినా కూడా దంపతులు తమ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో.. స్థానికులకు వారి పిల్లలకు సమాచారం అందించారు. ఇల్లు తెరిచి చూడగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.