Telangana | బీజేపీ- విమోచన బీఆరెస్- సమైక్యతా దినోత్సం కాంగ్రెస్- విజయ భేరీ కమ్యూనిస్టులు- సాయుధ పోరాట ఉత్సవాలు విధాత, హైదరాబాద్: సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిన చారిత్రాత్మకమైన రోజు.. నిజాం పాలననుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన చారిత్రక సందర్భం. కానీ ఈ రోజును జరుపుకోవడంలో కూడా రాజకీయ పార్టీలు ఓట్లను, సీట్లను ప్రాతిపదికగా చూస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక సందర్భానికి రాజకీయ పార్టీలు వారికి నచ్చిన బాష్యం చెబుతూ పోటాపోటీ సభలు […]

Telangana |
- బీజేపీ- విమోచన
- బీఆరెస్- సమైక్యతా దినోత్సం
- కాంగ్రెస్- విజయ భేరీ
- కమ్యూనిస్టులు- సాయుధ పోరాట ఉత్సవాలు
విధాత, హైదరాబాద్: సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిన చారిత్రాత్మకమైన రోజు.. నిజాం పాలననుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన చారిత్రక సందర్భం. కానీ ఈ రోజును జరుపుకోవడంలో కూడా రాజకీయ పార్టీలు ఓట్లను, సీట్లను ప్రాతిపదికగా చూస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక సందర్భానికి రాజకీయ పార్టీలు వారికి నచ్చిన బాష్యం చెబుతూ పోటాపోటీ సభలు జరుపుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేల రాజకీయ పార్టీలకు పోటా పోటీ సభలు నిర్వహించే వేదిక అయింది. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి, ఏ బండ్లో పోతావు కొడకో నైజా సర్కరోడా అని నాటి తెలంగాణం పాడుకుంటే, ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి దొరికిన సందర్భంగా మార్చేశారు. దేశంలోని 550 సంస్థానాల మాదిరిగానే హైదరాబాద్ సంస్థానం కూడా భారత్‌లో విలీనమైంది సెప్టెంబర్ 17న.
అయితే విలీనం సమయంలో ఇక్కడి భూ స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరుగుతున్న సందర్భం కావడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది. అయితే బీజేపీ ఈ పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చూపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ విమోచన దినోత్సవం పేరిట సెప్టెంబర్ 17ను నిర్వహించడానికి సిద్దమైంది.
సమైక్యతా దినంగా జరపాలని అధికార బీఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దుయ్యబట్టి, హిందువుల మద్దతు పొందేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన పార్టీగా ప్రజల మద్దతుతో 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆరెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నది. భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన ఒక చారిత్రక సందర్భంగా మాత్రమే దీనిని వర్ణిస్తున్నది. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు అందరు కలిసి సమైక్యంగా ఉండాలన్న లక్ష్యంతో సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపింది.
ఈ మేరకు పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. నిజాం అరాచకాలు, నాటి పాలనలో ప్రజలు ఎదుర్కొన్న భయానక కష్టాల జోలికి వెళ్లకుండా అధికార ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ముస్లిం ఓట్లు దూరమవుతాయన్న ఆలోచనతో ఈ వైఖరి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక సాయుధ పోరాటంలో భాగస్వాములుగా ఉన్న కమ్యూనిస్టులు భూమి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్17ను నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయుధ పోరాట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ చారిత్రక సందర్భాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కసరత్తు చేపట్టింది. ఏకంగా సీడబ్ల్యుసీ అంతా హైదరాబాద్‌కు తరలి వచ్చింది. సెప్టెంబర్ 17ను విజయానికి సూచికగా ఆదివారం సాయంత్రం నగరశివారులోని తుక్కుగూడలో 10 లక్షల మందితో విజయ భేరీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నది. దీన్ని టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించే విజయ భేరీ బహిరంగ సభకు పోటీగా బీఆరెస్ మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణా జలాలతో ఊరూర ఉన్న దేవతల వద్ద పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17ను రాష్ట్రంలో ఎన్నికల వేళ ఆయా పార్టీలు పోటా పోటీగా సభలు, కార్యక్రమాలు నిర్వహించి, రాజకీయ లబ్ధి పొందేందుకు తాపత్రయపడటం చర్చనీయాంశమైంది.
