Mahabubnagar | ఓ యువకుడికి పెళ్లి కుదిరింది. కానీ తన చేతిలో డబ్బు లేదు. మరి పెళ్లి చేసుకోవడం ఎలా..? అని ఆలోచించాడు. అందుకు దొంగతనమే సరైందని భావించి.. పక్కింట్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్దరేవల్లిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్ద రేవల్లికి చెందిన జాజిమొగ్గల సురేశ్‌కు ఇటీవలే పెళ్లి కుదిరింది. కానీ పెళ్లి చేసుకునేందుకు సరిపోయినంతా డబ్బు అతని వద్ద లేదు. దీంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా పక్కింట్లోనే చోరీ చేయాలని సిద్ధపడ్డాడు.
కళ్లకు గంతలు కట్టి.. నోట్లో చీర కుక్కి..
సురేశ్ ఈ నెల 21న అర్ధరాత్రి సమయంలో వాడ్యాల పద్మమ్మ(68) ఇంట్లోకి వెళ్లి కరెంట్ బంద్ చేశాడు. పద్మమ్మ అరవకుండా నోట్లో చీర కుక్కి కళ్లకు గంతలు కట్టాడు. ఇక ఆమె చేతికి ఉన్న నాలుగు తులాల బంగారు గాజులు, మెడలోని ముత్యాల దండ, పుస్తెల తాడు, బంగారు కమ్మలను దొంగిలించి పారిపోయాడు.
పద్మమ్మ మర్నాడు ఉదయమే బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. సురేశ్ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.