Accident |
- మృత్యువులోనూ వీడని బంధం
- ఒకరు రైల్వే ట్రైనీ టీసీ.. మరొకరు సాఫ్ట్‌వేర్
- మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్న దమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఒకరు శివరాం (24) రైల్వే ట్రైనీ టికెట్ కలెక్టర్ కాగా రెండో వాడు హరికృష్ణ (23) సాప్ట్ వేర్.
ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గావడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృత్యువులో సైతం వీడని అన్నదమ్ముల బంధాన్ని చూసిన వారు అయ్యో అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
ఎల్కతుర్తి ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై పరమేష్, హసన్ పర్తి ఎస్సై దేశిని విజయ్ కుమార్ పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ పుటేజిని పరిశీలిస్తున్నారు.
హోటల్ నడుపుకుంటూ
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్ కందుగులలో హోటల్ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను కష్టపడి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు.
పెద్దవాడు శివరాం (24) ఇటీవలే రైల్వేలో టికెట్ కలెక్టర్ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. రెండవ వాడు హరికృష్ణ (23) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్టు వేర్ గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ ప్రయోజకులుగా ఎదగడంతో గ్రామంలో ఆ కుటుంబానికి మoచి పేరుంది.
ఇక త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి. సోమవారం శివరాం, హరికృష్ణలు హైదరాబాద్ వెళ్ళేందుకు కందుగుల నుంచి తెల్లవారుజామున 5 గంటలకు తమ ద్విచక్ర వాహనం పైన బయలుదేరారు.
మార్గమధ్యలో అనంతసాగర్ క్రాసు రోడ్డు వద్ద మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసిన వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుల తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.