- పొంగులేటికి గన్మెన్ల కుదింపు
- ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు ఉపసంహరణ
- ప్రభుత్వ కక్ష సాధింపుపై ఆగ్రహం
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, ప్రజా ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ, రాజకీయ నాయకుల కనుసన్నల్లో పావుగా మారి భ్రష్టు పట్టిపోతున్నది. అధికారంలో ఉంటే ఒక తీరూ విపక్షంలో ఉంటే మరో తీరూ అనే పద్ధతిని కొనసాగిస్తున్నారు.
గన్మెన్ల వ్యవహారం రాజకీయంగా మారింది. తాజాగా వరంగల్, ఖమ్మం జిల్లాలోని ఇద్దరు నాయకులకు గన్మెన్లను తగ్గించడం, ఉపసంహరించడం రాజకీయ రచ్చగా మారింది.
వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు, ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గన్మెన్లను తగ్గించడం, ఉపసంహరించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ మాత్రం సిగ్గుపడకుండా నగ్నంగా ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. విలువలు, విషయాలు, సంప్రదాయం, పద్ధతి వేటికి కట్టుబడకుండా అధికార యంత్రాంగాన్ని తమ తాబేదారులుగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
స్టేటస్ సింబల్‌గా మారిన గన్మెన్లు
వాస్తవానికి రాజకీయ నాయకులలో కొంతమందికి పోలీసు గన్ మెన్ల అవసరమే లేదు. గన్ మెన్ లను కలిగి ఉండడం కూడా గత దశాబ్ద కాలంగా స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అవసరమున్నా, లేకున్నా గన్మెన్లను కలిగి ఉండడం అనేది ఒక పద్ధతిగా కొనసాగుతోంది.
ప్రజారక్షణలో భాగస్వామ్యం కావలసిన పోలీసులను తమ అంగరక్షకులుగా మార్చుకుని వారితో విచ్చలవిడి కార్యక్రమాలకు పాల్పడుతున్న అక్రమార్కులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇదంతా ఎందుకంటే అసలు ఎవరికి గన్మెన్లు అవసరమో వారికి కేటాయించకుండా ఇష్టానుసారంగా కొనసాగించడంతో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గన్మెన్ల రక్షణకు రాజకీయరంగు
తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ గన్మెన్ల వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. తమకు నచ్చిన వారికి గన్మెన్లను కొనసాగిస్తూ… తమకు నచ్చని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తమకు నచ్చిన వారికి కొనసాగించడం గిట్టనివారికి గన్మెన్లను తగ్గించడం లేక పూర్తిగా రద్దు చేయడం చేస్తూ తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తున్న నాయకులకు కొనసాగుతున్న గన్మెన్లను ఉపసంహరిస్తూ, తగ్గిస్తూ వాళ్ళని బెదిరించే కార్యక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుంది. పోలీసు అధికారులు కూడా ఈ విషయాలను పట్టించుకోకుండా గుడ్డిగా అమలు చేస్తూ ప్రభుత్వానికి అధికార పార్టీకి అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఇద్దరు నాయకులకు గన్మెన్లను తగ్గించడం, ఉపసంహరించడం రాజకీయ రచ్చకు దారితీస్తోంది.
పొంగులేటికి సెక్యూరిటీ తగ్గింపు
దశాబ్ద కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులకు హఠాత్తుగా గన్ మెన్లను ఉపసంహరించడం, సెక్యూరిటీని తగ్గించడం విమర్శలకు తావిస్తోంది. నిజంగా అవసరంలేని వారందరికీ తొలగిస్తే విమర్శలకు తావులేదు. కానీ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అభ్యంతరం.
ఖమ్మం జిల్లాలో రాజకీయ నాయకునిగా, కాంట్రాక్టర్ గా పేరొందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇటీవల సెక్యూరిటీ తగ్గించిన విషయం తెలిసిందే. గన్మెన్ల సంఖ్య తగ్గించి ఆయనకు కొనసాగిస్తున్న పైలెట్ వాహనాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ చర్య పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన పొంగులేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం టిఆర్ఎస్ లో చేరారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటిని కాదని నామాకు తిరిగి ఎంపీ టికెట్ ఇచ్చి పొంగులేటిని పక్కకు పెట్టారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నప్పటికీ ఓపికగా గులాబీ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.
కానీ ఈ ఏడాది ప్రారంభంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించిన తన అనుచరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటూ అధిష్టానం ఆయనపై కక్ష సాధింపు చర్యలకు సిద్ధమైంది. పొంగులేటి పార్టీ మారుతారని సంకేతాలు వెలువడడంతో ఆయనను బెదిరించేందుకు సెక్యూరిటీ తగ్గించి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుచరులే అంగరక్షకులు: పొంగులేటి
గన్మెన్లను తగ్గించడం పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ తనకు రక్షణ కావాలని ఎప్పుడూ కోరలేదన్నారు. వాళ్ళెందుకు రక్షణ కల్పించారో ఇప్పుడు అర్ధాంతరంగా ఎందుకు ఉపసంహరించారో ప్రభుత్వానికే తెలియాలని విమర్శించారు. తన అనుచరులు, కార్యకర్తల అండదండలు ఉండగా తనకు మరో రక్షణ ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎర్రబెల్లికి గన్మెన్ల ఉపసంహరణ
ఖమ్మం పొంగులేటి ఎపిసోడ్ ముగియక ముందే వరంగల్ జిల్లాలో నిన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలో నాయకునిగా కొనసాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు కొద్ది రోజుల క్రితం బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయనకు 2 + 2 గన్మెన్ల రక్షణ కల్పించారు. నిన్నటి వరకు కూడా గన్మెన్ల రక్షణ కొనసాగించారు. కానీ సడన్ గా మంగళవారం గన్ మెన్లను పోలీసు అధికారులు వెనక్కి పిలిపించారు. రక్షణ నుంచి వెనక్కి రప్పించడం ఇప్పుడు రాజకీయ సాధింపు చర్యలో భాగంగానే చేశారని విమర్శిస్తున్నారు. దీనిపై ప్రదీప్ రావు తీవ్రంగానే ప్రతిస్పందించారు.
నాకేం జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత: ప్రదీప్‌రావు
తన ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా అధికార పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రాణహాని ఉందని ఏడు సంవత్సరాలుగా ప్రదీప్ రావుకు సెక్యూరిటీ కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు సడన్ గా సెక్యూరిటీని ఎందుకు తీసేశారు.
పార్టీ మారినందుకు సెక్యూరిటీగా ఉన్న గన్మెన్లను తొలగించడం ముమ్మాటికి ప్రభుత్వం కక్ష సాధింపే. గతంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రదీప్ రావు మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వానికి కూడా తెలిసినవే అన్నారు.
సెక్యూరిటీని తొలగించడానికి కారణాలు చెప్పకుండా సీపీ ముఖం చాటేస్తున్నారు. తనకు ఏదైనా హాని జరిగితే పూర్తి బాధ్యత పోలీస్ యంత్రాంగానిది ఎమ్మెల్యే నరేందరర్ది మాత్రమే అని స్పష్టంగా చెప్పారు.
ఇదిలా ఉండగా తీవ్ర విమర్శల పాలవుతున్న గన్ మెన్ వ్యవస్థ పై పారదర్శకంగా సమీక్షించి నిజాయితీతో ఒక పద్ధతిని అమలు చేసినప్పుడే ఇలాంటి రాజకీయ విమర్శలకు అవకాశం లేకుండా పోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ దిశగా సానుకూల చర్యలు చేపట్టనంతకాలం ఇలాంటి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి.