Adipurush Trailer
విధాత, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
ఇంతకుముందు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్ ఎటువంటి స్పందనను రాబట్టుకుందో తెలిసిందే. ముఖ్యంగా యానిమేషన్ సినిమాలా ఉందంటూ ప్రభాష్ ఫ్యాన్స్ దర్శకుడిని ట్రోల్ చేశారు. దీంతో దర్శకుడు దిద్దుబాబు చర్చలు చేపట్టారు.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రత్యేక ప్రదర్శనల ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. టీజర్ కంటే చాలా బెటర్‌గానే అనిపిస్తుంది. హనుమంతుడి కోణంలో సాగే కథలా ఈ ‘ఆదిపురుష్’ ఉండబోతుందనేది ఈ ట్రైలర్ ఆరంభంలోనే క్లారిటీ ఇచ్చేశారు. 3D వెర్షన్‌లో ఎలా ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం యూట్యూబ్ వెర్షన్ వరకు మాత్రం ఓకే అనే స్పందననే ఈ ట్రైలర్ రాబట్టుకుంటోంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం. నా రాఘవుడి కథే రామాయణం..’’ అంటూ హనుమంతుడు చెబుతున్న డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
ఆ వెంటనే భిక్షాందేహీ అంటూ రావణుడి ఎంట్రీ.. సీతను అపహరించడం చూపించారు. సీతను తీసుకురావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని సూచిస్తుంది.
ట్రైలర్ ను బట్టి చూస్తే ఆదిపురుష్ రామాయణ కావ్యం మొత్తం కాకుండా కేవలం సీతాపహరణం ఎపిసోడ్‌ను మాత్రమే హైలెట్ చేస్తూ.. ఈ ‘ఆదిపురుష్’ తెరకెక్కించినట్లుగా అనిపిస్తోంది. చివర్లో వచ్చిన రామ రావణ యుద్ధానికి నేటి ఆధునిక టెక్నాలజీని వాడినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్‌గా అయితే విజువల్‌గా ఆకట్టుకునేలానే ఉంది. ఈ ట్రైలర్‌పై అంతగా విమర్శలు రాకపోవచ్చు.
అయితే ఇందులో ప్రభాస్ డైలాగ్స్ చెబుతుంటే.. బాహుబలిలో ‘జై మహిష్మతి’ అని అన్నట్లే అనిపిస్తుంది. రాముడు మృదుస్వభావి అని పురాణాలు చెబుతున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాముడిని ఇందులో చాలా సీరియస్‌గా చూపించారు. అలాగే సీత పాత్రకు కృతిసనన్ సరిపోలేదని అనిపిస్తుంది. హనుమంతుడి పాత్రకు మాత్రం పూర్తి న్యాయం జరిగినట్లుగా అయితే ఈ ట్రైలర్ ప్రకారం తెలుస్తుంది.
మొత్తంగా అయితే.. ట్రైలర్‌తో సినిమాపై కాస్త అంచనాలు అయితే క్రియేట్ అవుతాయి. చిన్న చిన్న దోషాలు మాత్రం ఈ ట్రైలర్‌లోనూ కనిపిస్తుండటం విశేషం. అందుకే అంది.. టీజర్ కంటే ఈ ట్రైలర్ చాలా బెటర్‌గానే ఉందని. ఇక సినిమాతో ఏం చేస్తారో చూడాలి. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.