Aditya-L1 | భారత తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య విజవంతంగా కొనసాగుతున్నది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్‌-1 కక్ష్యను ఐదోసారి విజయవంతంగా మార్చింది. ఇప్పటి వరకు భూమి కక్ష్యలో తిరిగిన ఆదిత్య-ఎల్‌.. ప్రస్తుతం సూర్యుడికి భూమికి మధ్య ఉన్న ఎల్‌-1 పాయింట్‌ వైపు బయలుదేరిందని ఇస్రో తెలిపింది. ఈ నెల 2న ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను ఇస్రో శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపింది. సెప్టెంబర్‌ 3న తొలిసారిగా కక్ష్యను మార్చింది. ఎర్త్‌ బౌండ్‌ […]

Aditya-L1 |

భారత తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య విజవంతంగా కొనసాగుతున్నది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్‌-1 కక్ష్యను ఐదోసారి విజయవంతంగా మార్చింది. ఇప్పటి వరకు భూమి కక్ష్యలో తిరిగిన ఆదిత్య-ఎల్‌.. ప్రస్తుతం సూర్యుడికి భూమికి మధ్య ఉన్న ఎల్‌-1 పాయింట్‌ వైపు బయలుదేరిందని ఇస్రో తెలిపింది. ఈ నెల 2న ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను ఇస్రో శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపింది.

సెప్టెంబర్‌ 3న తొలిసారిగా కక్ష్యను మార్చింది. ఎర్త్‌ బౌండ్‌ ఫైర్‌ నిర్వహించి.. కక్ష్యను మార్చినట్లు పేర్కొంది. ఆ తర్వాత 5న రెండోసారి, 10న మూడోసారి, 15న నాలుగోసారి కక్ష్యను మార్చగా.. తాజాగా మరోసారి కక్ష్య పెంపు విన్యాసాన్ని నిర్వహించింది. ప్రస్తుతం భూమి కక్ష్య నుంచి బయలుదేరిన రాకెట్‌.. కక్ష్యను మార్చుకుంటూ దాదాపు 110 రోజుల ప్రయాణం తర్వాత ఎల్-1 పాయింట్‌ను చేరుకోనున్నది.

ఇక్కడి నుంచే సూర్యుడిపై పరిశోధనలు చేపట్టనున్నది. అయితే, ఆదిత్య ఎల్‌-1 ఇప్పటికే తన పనిని మొదలుపెట్టింది. ఇందులో అమర్చిన స్టెప్స్ అనే పరికరం ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించినట్టు ఇస్రో పేర్కొంది. భూమికి 50 వేల కిలోమీటర్ల దూరంలో సూపర్ థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ డేటాను నమోదు చేస్తోందని, సౌర వాతావరణాల్ని పూర్తి స్థాయిలో పరిశోధించడమే ఆదిత్య ఎల్ 1 లక్ష్యమని పేర్కొంది. సూర్యుడి మంటలు, సౌర రేణువులతో పాటు సూర్యునిపై వాతావరణం ఎలా ఉందో గుర్తించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

అయితే, సూర్యుడి బయటి వాతావరణంపై ప్రయోగం కోసం ఇస్రో ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టింది. ఇది సూర్యుడికి చేరువగా వెళ్లదు కానీ.. భూమి నుంచి ఇది 15లక్షల కిలోమీటర్ల నుంచి పరిశోధనలు జరుపుతుంది. భూమి నుంచి చంద్రుడు ఉన్న దూరానికి ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ దూరం ఉంటుంది. కానీ భూమి, సూర్యుడి మధ్య దూరంలో ఇది ఒక శాతం మాత్రమే కావడం గమనార్హం. ఆదిత్య ఎల్1-లో L1 అనేది సూర్యుడికి, భూమికి మధ్య గురుత్వాకర్షణ పరంగా స్థిరమైన ప్రాంతం. ఇక్కడ శాటిలైట్‌ను మోహరించి.. పరిశోధనలు జరపాలని ఇస్రో లక్ష్యం పెట్టుకున్నది.

Updated On 19 Sep 2023 8:56 AM GMT
krs

krs

Next Story