Adultery |
విధాత: వ్యభిచారం తప్పు కాదని అయితే అది ఇతరులకు జుగుప్స కలిగించేలా పబ్లిక్ ప్రదేశాల్లో చేస్తేనే నేరమని ముంబయిలోని ఓ సెషన్సు కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు 34 ఏళ్ల ఓ మహిళకు షెల్టర్ హోం నుంచి స్వేచ్ఛను కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు ములుంద్ ఏరియాలో రైడ్ చేయగా ఈ మహిళ పట్టుబడింది. అనంతరం మేజిస్ట్రేట్ కోర్టు ఆమెను ఒక ఏడాది పాటు షెల్టర్ హోంలో ఉండాలని ఆదేశించింది. దీనిపై సదరు మహిళ సెషన్సు కోర్టును ఆశ్రయించారు.
‘ఆర్టికల్ 19 ప్రకారం దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగడం ప్రాథమిక హక్కు. ఈ కేసులో మేజర్ అయిన మహిళ ఏ తప్పూ చేయనప్పటికీ ఈ హక్కుకు దూరమైనట్టు భావిస్తున్నాం. పోలీసు రిపోర్టుల్లో కూడా ఆమె పబ్లిక్ ప్రదేశాల్లో వ్యభిచారం చేసినట్లు లేదు.
కేవలం సెక్స్ వర్కర్ అన్న కారణం చేత అరెస్టు చేయడానికి లేదు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాం’ అని పేర్కొంటూ ఆ మహిళను విడుదల చేయాలని షెల్టర్ హోంను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది