Saturday, January 28, 2023
More
  Homelatestవిద్యుత్‌ బిల్లుల అడ్వాన్స్ (ACD) ఉపసంహరించుకోవాలి: రేవంత్‌ రెడ్డి

  విద్యుత్‌ బిల్లుల అడ్వాన్స్ (ACD) ఉపసంహరించుకోవాలి: రేవంత్‌ రెడ్డి

  • ప్రభుత్వ వైఫల్యానికి.. ప్రజలపై భారమా..?
  • ఏసీడీ పేర వసూలు చేస్తున్న అదనపు విద్యుత్‌ బిల్లులను నిలిపేయాలి!
  • వ్యాపార నిర్వహణలకు పోలీస్‌ అనుమతి తప్పనిసరి చేయటం దుర్మార్గం
  • మరో బషీర్‌బాగ్‌ లాంటి పోరాటం చేస్తాం

  విధాత: రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాల్లో అగ్రభాగాన నిలిపాననీ, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు పోయే కేసీఆర్‌ విద్యుత్‌ బిల్లుల్లో ‘ఏసీడీ’ పేరుతో అదనపు భారం మోపుతున్నారని దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.

  విద్యుత్‌ విషయంలో దేశానికే ఆదర్శమని చెప్పుకొనే సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ వినియోగదారులపై ఏసీడీ చార్చీల పేరుతో అదనపు భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ఏసీడీ పేరుతో రెండు నెలల విద్యుత్‌ బిల్లు అడ్వాన్స్ గా తీసుకోవటం ప్రజలపై తీరని భారమని అన్నారు. అలాగే వ్యాపార నిర్వహణలకు పోలీస్‌ అనుమతి తప్పనిసరి చేయటం దుర్మార్గం అన్నారు. ఇలాంటి నిబంధనలతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేయటమేనని విమర్శించారు.

  ప్రజా వ్యతిరేక విధానాలను కేసీఆర్‌ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, లేకుంటే.. తెలంగాణ ప్రజలకు బషీర్‌బాగ్‌ లాంటి పోరాటం చేసిన చరిత్ర ఉన్నదని మరువరాదని హెచ్చరించారు. అవసరమైతే.. ప్రజావ్యతిరేక విద్యుత్‌ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలకు వెనుకాడదని అన్నారు.

  ఇలాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తున్న వామపక్షాలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు సాగే పోరులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లేకుంటే.. కేసీఆర్‌ పాపాల్లో పాలు పంచుకున్న వారవుతారని రేవంత్‌ అన్నారు.

  కేసీఆర్‌ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ అసమర్థ పాలనతో అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. అవినీతి, అసమర్థ పాలనలో వ్యవస్థల పతనాన్ని కప్పి పుచ్చుకోవటానికి విద్యుత్‌ ఏసీడీ ఛార్జీల పేరుతో భారం మోపడటం తగదన్నారు.

  గతంలో అభివృద్ధి చార్జీలు, ఎడ్యుకుషన్‌ సెస్సులు, గ్రీన్‌ సెస్సుల పేరుతో తెలంగాణ ప్రజలపై భారం మోపారనీ, ఇప్పుడు తాజాగా రెండు నెలల విద్యుత్‌ బిల్లుల డిపాజిట్‌ పేరుతో పేదవాడి జేబుకు చిల్లులు పెడుతున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు.

  దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని గొప్పలు పోయే కేసీఆర్‌ ప్రభుత్వం.. విద్యుత్‌ సంస్థలు 60వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన విషయాన్ని ఏమనాలని ప్రశ్నించారు. ప్రభుత్వమే విద్యుత్‌ సంస్థలకు రూ. 20వేల కోట్లు బకాయి పడింది నిజం కాదా అని నిలదీశారు. విద్యుత్‌ సంస్థలు నష్టాల్లో కూరుకుపోవటానికి ప్రభుత్వం కారణమైతే, ప్రజలెందుకు భారం మోయాలని రేవంత్‌ నిలదీశారు.

  కేసీఆర్‌ చేపట్టిన పవర్ ప్రాజెక్టులన్నీ తప్పుల తడకలనీ, లోపభూయిష్టాలని నిపుణులు ఏనాడో చెప్పారని రేవంత్‌ అన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం అంతా అసమగ్రం, దాంతో.. తెలంగాణ ప్రజలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరించినా నాడు కేసీఆర్‌ పెడ చెవిన పెట్టారని విమర్శించారు.

  అలాగే.. యాదాద్రి-భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో కాలం చెల్లిన సాంకేతికతను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు మిగిలేది భారమే తప్ప ప్రయోజంన ఏమీ లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular