Ahimsa Review: మూవీ పేరు: ‘అహింస’ విడుదల తేదీ: 2 జూన్, 2023 నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడీ, దేవీ ప్రసాద్, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు సంగీతం: ఆర్పీ పట్నాయక్ కెమెరా: సమీర్ రెడ్డి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు ఆర్ట్: సుప్రియ నిర్మాత: పి. కిరణ్ కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: తేజ నూతన నటీనటులతో కూడా బ్లాక్‌బస్టర్ కొట్టగల నైపుణ్యం, టాలెంట్ ఉన్న దర్శకుడెవరయ్యా.. అంటే ఠక్కున గుర్తొచ్చే […]

Ahimsa Review:

మూవీ పేరు: ‘అహింస’
విడుదల తేదీ: 2 జూన్, 2023
నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడీ, దేవీ ప్రసాద్, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు
సంగీతం: ఆర్పీ పట్నాయక్
కెమెరా: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: సుప్రియ
నిర్మాత: పి. కిరణ్
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: తేజ

నూతన నటీనటులతో కూడా బ్లాక్‌బస్టర్ కొట్టగల నైపుణ్యం, టాలెంట్ ఉన్న దర్శకుడెవరయ్యా.. అంటే ఠక్కున గుర్తొచ్చే దర్శకుడు తేజ. నటీనటులలోని టాలెంట్‌ని పిండటంలో తేజ స్టైలే వేరు. ఆయన నుంచి వస్తున్న సినిమా అంటే.. ఖచ్చితంగా ఓ మంచి ప్రేమకథ అందులో ఉంటుందనేలా ఇప్పటి వరకు తేజ చిత్రాలు నిరూపించుకున్నాయి. అటువంటి తేజ.. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారు.

అందుకు కారణాలు ఏమిటనేది పక్కన పెడితే.. చాలా గ్యాప్ తర్వాత.. దగ్గుబాటి వారసుడు అభిరామ్ దగ్గుబాటిని పరిచయం చేసే బాధ్యతను ఆయన తీసుకోవడంతోనే.. ఆయన నుంచి మరో వినూత్నమైన సినిమా వస్తుందనే ముద్ర పడిపోయింది. ‘అహింస’ అని టైటిల్ పెట్టగానే తేజ ఏదో చేయబోతున్నాడనే సంకేతాలు వచ్చేశాయి.

అయితే విడుదల విషయంలో వాయిదాలు పడినప్పటికీ.. పాటలు, టీజర్‌తో ఈ సినిమాని వార్తలలో ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చాడు తేజ. ఇక విడుదల అనుకున్న తర్వాత.. తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో ఆయన మాట్లాడిన కాంట్రవర్సీ మాటలు.. ఈ సినిమాపై ఇంకాస్త ఇంట్రస్ట్‌ని పెంచాయి. మరి ఆ ఇంట్రస్ట్ తేజకి హిట్ ఇచ్చిందా? మళ్లీ ఆయనని బిజీ చేస్తుందా? అసలీ ‘అహింస’లో ఉన్న విషయం ఏమిటో.. రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కథగా చెప్పాలంటే.. ఇది విక్టరీ వెంకటేష్ ‘పెళ్లిచేసుకుందాం’ సినిమాలోని కీ పాయింట్‌ని టచ్ చేస్తూ నడుస్తుంది. బావామరదళ్లు అయిన రఘు (అభిరామ్ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ).. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టంగా పెరుగుతారు. వారి పెళ్లికి పెద్దలు నిశ్చితార్థం కూడా జరిపిస్తారు. నిశ్చితార్థం జరిగిన రోజే అహల్యపై ధనలక్ష్మీ దుష్యంత్‌రావు (రజత్ బేడీ) కుమారులు అత్యాచారం చేస్తారు.

ఇది తెలుసుకున్న రఘు.. అహల్యపై అత్యాచారం చేసిన వారిని చట్టరీత్యా శిక్ష వేయించాలని రంగంలోకి దిగుతాడు. అయితే అహింసా మార్గాన్ని నమ్మే రఘు.. న్యాయవాది లక్ష్మీ(సదా)తో కలిసి చేసిన పోరాటంలో విజయం సాధించాడా?. డబ్బు, పరపతి ఉన్న ధనలక్ష్మీ దుష్యంత్‌రావుని ఎదుర్కొనే క్రమంలో.. రఘు అహింసావాదం నిలిచిందా? అత్యాచారం చేసిన వాళ్లే తన మరదలిని చంపేయాలనుకుంటారు. వారి బారి నుంచి ఆమెను రఘు కాపాడుకోగలిగాడా? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ‘అహింస’ చిత్రం చూడాల్సిందే.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాలో రఘుగా నటించిన దగ్గుబాటి అభిరామ్‌కి ఇది తొలి చిత్రం. నటులలో నుంచి అసలుసిసలైన నటనను బయటికి రాబట్టడంలో సిద్ధహస్తుడైన తేజ.. అభిరామ్ విషయంలో మాత్రం సక్సెస్ కాలేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలలో తప్పితే.. చాలా వరకు అభిరామ్ నటన తేలిపోయింది. కథ పరంగా చాలా భావోద్వేగాలు ఇందులో ఉంటాయి. కానీ అభిరామ్‌ ఈ కథకు అస్సలు సెట్ కాలేదనే చెప్పుకోవాలి. ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపించింది. హీరోయిన్ గీతికా మాత్రం.. తన పాత్రకు చక్కగా న్యాయం చేసింది.

అందంగా కనిపిస్తూనే.. తనలోని టాలెంట్‌ని చూపించింది. ఇంకా చెప్పాలంటే న్యాచురల్ బ్యూటీ అనిపించుకుంటుంది. రజత్ బేడీ నటన మరీ ఓవరాక్షన్ అన్నట్లుగా ఉంది. అలాగే కమల్ కామరాజు పాత్ర కూడా అంత గొప్పగా ఏం లేదు. తేజ హీరోయిన్ సదాకు మాత్రం మంచి పాత్ర ఇందులో పడిందని చెప్పుకోవచ్చు. లాయర్‌గా ఆమె పాత్ర బాగుంది. సదా కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా ఓకే అని అనిపించుకుంటారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. తేజ సినిమాలకు అస్థాన మ్యూజిక్ దర్శకుడైన ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో మ్యూజిక్ దర్శకుడిగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తన పాత్రను పూర్తిగా న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలెట్. ఎడిటింగ్ పరంగా మాత్రం ఇంకా చాలా వరకు కత్తెర పడే సీన్లు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

అయితే ఎంత బాగున్నా.. దర్శకుడు రొటీన్ వేలో కథని తీసుకెళితే.. ప్రేక్షకులు తిప్పికొట్టడం అనేది కామనే. ఇక్కడ కూడా అదే జరిగింది. దర్శకుడు తేజ ఈ సినిమాని తెరకెక్కించిన తీరు మరీ రొటీన్ అనిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ తరహాలోనే ఈ సినిమా ఉంది కానీ.. అందులో పండినట్లుగా ఇందులో ఎమోషన్స్‌ని రాబట్టడంలో తేజ విఫలమయ్యాడని చెప్పుకోవాలి.

విశ్లేషణ:

హీరో బలహీనుడు.. విలన్ ధనవంతుడు.. ఇది తేజ సినిమాలలో ఉండే రొటీన్ పాయింట్. ఇందులో కూడా సేమ్ టు సేమ్ అదే కనిపిస్తుంది. కాకపోతే అత్యాచారం అనే టాపిక్‌తో సినిమాని నడిపించాలనుకున్న తేజ.. స్క్రీన్‌ప్లే విషయంలో ఆకట్టుకోలేక పోయాడు. ఉత్కంఠ రేపేలా సన్నివేశాలు సృష్టించే ఛాన్స్ ఉన్నా కూడా.. సోసోగానే తేజ సినిమాని చుట్టేశాడు. అహింసావాదాన్ని నమ్ముకున్న హీరో చేత కృష్ణతత్వపు మాటలు చెప్పించి.. హింస వైపు పురిగొల్పుతాడు. మరి దీనికి అహింస అని టైటిల్ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియాలి.

ఇక తేజ సినిమాలో ఉండే మరో రొటీన్ పాయింట్.. అడవి. ఈ సినిమాని కూడా అడవుల్లోకి తీసుకెళ్లాడు. మరి వేరే థాట్ రావడం లేదో.. లేదంటే అందులోనే ‘జయం’ ఉందని భావిస్తున్నాడో తెలియదు కానీ.. అప్పటి కాలం నుంచి తేజ ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. కథలో మంచి డెప్త్ ఉంది. నిజంగా తేజ వంటి దర్శకుడు.. ఇలాంటి కథతో బ్లాక్‌బస్టర్ కొట్టే ఛాన్స్ ఉంది కానీ.. ఆ కథని నేటి తరానికి, నేటి ట్రెండ్‌కు అనుగుణంగా మార్చడంలో మాత్రం సక్సెస్ కాలేదు. నేనింతే.. నా దారి రహదారి.. దానిలో నుంచి బయటికి రాను.. నాకు నచ్చినట్లుగా సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా చూస్తే.. నిజంగా తేజ ఇంకా ‘జయం’ దగ్గరే ఆగిపోయాడని అంతా అనుకుంటారు. కృష్ణతత్వానికి సంబంధించిన కొన్ని డైలాగ్స్, మధ్యలో అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్లు మినహా.. ఈ సినిమాలో అంతగా చెప్పుకోవడానికి ఏం లేదు. దర్శకుడు తేజ సినిమా అని ఏదో ఊహించుకుని వెళ్లిన వారు డిజప్పాయింట్ అవక తప్పదు. కొన్ని సీన్లు, హీరోయిన్ కోసం అయితే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. మొత్తంగా అయితే టాలెంటెడ్ దర్శకుడు తేజ నుంచి ఊహించిన చిత్రమైతే ఇది కాదు. కొత్తదనం లేని రొట్ట రొటీన్ సినిమా ఇది.

ట్యాగ్‌లైన్: కృష్ణ.. కృష్ణ.. ఏందయ్యా మాకీ నస!
రేటింగ్: 2/5

Updated On 3 Jun 2023 12:49 PM GMT
krs

krs

Next Story