Saturday, December 3, 2022
More
  Homelatestఅక్కసుతోనే సీఎం కేసీఆర్‌పై మోడీ విమర్శలు: మంత్రి జగదీష్ రెడ్డి

  అక్కసుతోనే సీఎం కేసీఆర్‌పై మోడీ విమర్శలు: మంత్రి జగదీష్ రెడ్డి

  విధాత: మునుగోడు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రతీ అక్షరం సీఎం కేసీఆర్ పై విషం చిమ్మేలా విమర్శలు చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణకు రావాల్సిన నిధులు వడ్డీతో సహా ఇస్తారన్న మీకే దేశ ప్రజలు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తారని చురకలంటించారు. కేసీఆర్ పై మోదీ విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారు. నీళ్లు.. పాలను వేరు చేసినట్లు విషాన్ని కూడా వేరు చేస్తారన్నారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతామన్నారు.

  అబద్ధాల పునాదుల మీద తెలంగాణలో బీజేపీ పార్టీ విస్తరణకు మోదీ చేస్తున్న ప్రయత్నం ఫలించబోధ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ధాని మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని అన్ని సంస్థలను చేసి తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కాకుండా బ్యాంకులను సైతం లోన్లు ఇవ్వకుండా బెదిరించి కేంద్రం తెలంగాణకు అన్ని విధాల అన్యాయం చేసిందన్నారు.

  అయినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆప‌కుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసినా చిత్తుగా ఓడిపోయామన్న అక్కసు తప్ప మోడీ మాటల్లో కొత్తగా కనబడింది ఏమీ లేదన్నారు. ప్రధాని మోడీ ఎన్ని సార్లు తెలంగాణకు వచ్చినా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు ఇవ్వలేద‌నేది తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.

  ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ పై విమర్శలు చేయాల్సిన అవసరం ప్రధాని మోదీకి ఎందుకో వచ్చిందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని, టీఆర్ఎస్ లో అలజడి తేవాలని ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ నాయకత్వం చెక్కుచెదరకుండా ఉందని మునుగోడు ఫలితంతో తేలిపోయింద‌న్నారు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పైన ఉన్న అభిమానం తట్టుకోలేక మోడీజీ ఆఘ మేఘాల మీద హైదరాబాద్‌ వచ్చి విషం కక్కా రన్నారు.

  తెలంగాణ రాష్ట్రం ఎనిమిది ఏళ్లలోనే నెంబర్ వన్‌గా నిలిచింద‌ని, 24 రాష్ట్రాల మంత్రులు, అధికారులు రాష్ట్రాన్ని సందర్శించి ఆదర్శంగా తీసుకున్నారన్నారు. మోడీ ఎప్పుడు వచ్చినా సరే తల్లిని చంపి బిడ్డను తెచ్చారంటూ తెలంగాణ రాష్ట్రం తప్పుడు పద్ధతులలో ఏర్పడిందని, పార్లమెంట్లో తీర్మానం తలుపులు పెట్టి చేశారని రకరకాల పద్ధతిలో అవమానించార‌ని గుర్తు చేశారు.

  రాష్ట్ర ఏర్పాటును అనుక్షణం వ్యతిరేకించిన సంగతి తెలంగాణ ప్రజలు మరిచిపోరన్నారు. నన్ను, బీజేపీని అంటే ఏమనను ప్రజలను అంటే ఊరుకోనంటూ కేసీఆర్ పై విమర్శలు చేసిన మోడీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తే, మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లను, పాలను వేరు చేసే శక్తి ఉందని కేసీఆర్ నాయకత్వం ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు.

  మోదీకి తిట్లు దీవెనలయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఆయన కంటే ఎక్కువ తిట్లే దీవెనలుగా పొందారన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రధాని మోడీ పై వ్యక్తిగత దూషణలు చేయలేదని బీజేపీ నాయకులే రెండేళ్లుగా కేసీఆర్ పై దూషణల భాష ఉపయోగించారని అన్నారు.

  ప్రధాని మోడీకి నిజంగా తెలంగాణ రాష్ట్రం పట్ల పేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. పేద‌లకు ఏమీ చేయ‌ని మోడీ పేదల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఏ ఇద్దరు పేదలను ప్రపంచ నెంబర్ వన్ గా చేసేందుకు కృషి చేస్తున్నారో ఆదాని, అంబానీలను చూస్తే దేశ ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page