- అటకెక్కిన వరంగల్కిచ్చిన హామీలు
- ప్రజా క్షేమం పట్టని కేసీఆర్
- ఇవ్వడం కంటే పుచ్చకునేది ఎక్కువ..
- బీజేపీ ర్యాలీలో ఈటల రాజేందర్ విమర్శ
విధాత, వరంగల్: తెలంగాణ నెంబర్ వన్ అని చెప్తారు.. దేనిలో నెంబర్ వన్.. దౌర్జన్యాల్లో నెంబర్ వన్. ప్రజలను కలుసుకోకుండా ఉండటంలో నెంబర్ వన్.. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించు కోవడంలో నెంబర్ వన్.. దళితులకు ఏనాడో ఇచ్చిన భూములను గుంజుకోవడంలో నెంబర్ వన్.. ధరణి పెట్టి తన భూములు ఉంటాయో? పోతాయో? బెంగ పడేలా చేయడంలో నెంబర్ వన్… వేధించడం, డబ్బులు వసూలు చేయడం తప్ప ప్రజలకు న్యాయం చేయాలని సంకల్పం బీఆర్ఎస్ నేత, సీఎం కేసీఆర్ కి లేదని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ పాలక్గా నియామకమైన తర్వాత మొదటిసారి ఈటల శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం తెలంగాణకు గుండెకాయలాంటిది అన్నారు. గుడిసెల్లో ఉన్నవారు పల్లెల్లో ఉపాధి లేక పట్నానికి వచ్చి రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారని, అమలయ్యాయా అంటూ ప్రశ్నించారు.
నోటిఫికేషన్లు ప్రకటించడం.. రద్దు చేయడం..
లక్షలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. తదుపరి నోటిఫికేషన్లు రద్దు చేస్తున్నారు. ఉద్యోగాలు రాక అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక చనిపోతున్నానని ఉత్తరాలు రాస్తున్నారు. రూ. 3116 నిరుద్యోగ భృతి ఇస్తానని కాలం గడిచిపోయిందని విమర్శించారు.
గల్లీగల్లీకి బ్రాంది షాపూ
ఎక్కడపడితే అక్కడే బ్రాందీ షాపులకు అనుమతులు ఇచ్చారు. స్కూళ్ల పక్కన, గుళ్ళ పక్కన పర్మిషన్ ఇచ్చారు. రెండు వందల మందికి ఒకటి చొప్పున బెల్ట్ షాపులు పెట్టారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చే దానికంటే పుచ్చుకున్నదే ఎక్కువ
పెన్షన్లకి 45 లక్షల మందికి కెసిఆర్ ఇచ్చేది రూ.9వేల కోట్లు, పుస్తె కట్టేందుకు రూ.2వేల కోట్లు, రైతులకు ఇస్తున్నది రూ.10 వేల కోట్లు, మూడింటికి రూ. 22వేల కోట్లు మాత్రమే కానీ, మనం తాగడం ద్వారా సర్కారుకు రూ.45 వేల కోట్లు కడుతున్నామని చెప్పారు.
“ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కాక బోడ మల్లన్న” అనేది కేసీఆర్ విధానమని ఈటల రాజేందర్ అన్నారు. ర్యాలీలో వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బీజేపీ సీనియర్ నాయకులు రాజయ్య యాదవ్, సమ్మిరెడ్డి, అశోక్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, అచ్చ విద్యాసాగర్, కుసుమ సతీష్, రమణ, మోహన్ ఆచారి, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.