- తల్లిదండ్రులకు మిగిలిన కడుపు కోత
- డాక్టర్ సైఫ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం
- మసక బారిన కేఎంసీ ప్రతిష్ట
- పోలీసులకు మరక తప్పలేదు
- ఏకపక్షమంటూ మీడియాపై విమర్శలు
- రాజకీయ పక్షాల అత్యుత్సాహంపై ఆగ్రహం
- ఆఖరికి గవర్నర్‌కు తప్పని ఇబ్బంది
- ప్రభుత్వ నిర్లక్ష్యంపై పలు విమర్శలు
డాక్టర్ ప్రీతి (Dr. Darawath Preethi) ఆత్మహత్యకు ఎవరి బాధ్యత ఎంత? ఇప్పడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తున్నది. బిడ్డను కోల్పోయిన ప్రీతి తల్లిదండ్రలు తల్లడిల్లి పోతుంటే.. ప్రీతి మరణానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనలో తగిన విధంగా వ్యవహరించలేదని పోలీసులు, కాలేజీ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. ఏ ఒక్క దశలోనైనా కీలకమైన వ్యక్తులు జోక్యం చేసుకుని ఉంటే.. ఇంత ఘోరం చోటు చేసుకునేది కాదని అంటున్నారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: లంబాడ గిరిజన బిడ్డగా ఒక మారుమూల తండా నుంచి ఎదిగి పీజీ మెడికో స్థాయికి ప్రీతి ఎదగడం ప్రస్తుతం ఉన్న అంతరాల వ్యవస్థలో అంత సులభమైన విషయమేమీ కాదు. అదే సమయంలో వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలకు గురైన డాక్టర్ సైఫ్ కుటుంబ పూర్వా పరాలను పరిశీలించినా సామాన్య మైనారిటీ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు కావడం గమనార్హం. ప్రాణాలు పోగొట్టుకున్న ప్రీతి మొదటి బాధితురాలుగా మిగలగా కేసులో ఇరుక్కున్న డాక్టర్ సైఫ్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
కేఎంసీకి మరక తప్పలేదు
డాక్టర్ ప్రీతి (Dr. Darawath Preethi) సంఘటనలో ప్రభుత్వ విద్యా సంస్థ కాకతీయ మెడికల్ కాలేజ్ (kakatheeya Medical Collage) ప్రతిష్ఠ మసకబారింది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మోహన్ దాస్, హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి సరైన సమయంలో ఇంకాస్త చొరవ ప్రదర్శించి, తగిన విధంగా స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
వారి నిర్లక్ష్యం ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఎంజీఎం హాస్పిటల్ (MGM Hospital) లో ఉన్నత స్థాయి వ్యక్తుల స్పందన పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అడ్మినిస్ట్రేషన్ అంతా సైఫ్ కు మద్దతిస్తున్నారని, వాస్తవాలు తొక్కిపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.
పోలీసుల తీరుపై ఆరోపణలు
ప్రీతి తండ్రి నరేందర్ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించలేదని, వారు స్పందించి ఉంటే ప్రీతి ప్రాణం పోయి ఉండేది కాదని అంటున్నారు. పోలీసుల సంగతి పక్కన పెడితే.. ముందుగా కళాశాల మేనేజ్‌మెంట్‌తో ప్రీతి తండ్రి మాట్లాడి ఉన్నా.. పరిస్థితి విషాదాంతం అయ్యేది కాదని చర్చ జరుగుతున్నది. సకాలంలో స్పందించక, జాప్యం చేసిన పోలీసులు.. తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేసును తీవ్రం చేశారన్న మరో విమర్శ కూడా వినిపిస్తున్నది.
మతం రంగు పులిమేందుకు రాజకీయ యత్నాలు
ఈ ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనలో వేధింపులు ఉన్నప్పటికీ.. ప్రేమ కోణం లేదు. కానీ.. ఇది ‘లవ్ జిహాద్’ (Love Jihad) అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bndi Sanjay) చేసిన ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి అంశాన్ని మతంతో ముడిపెట్టందుకు నీచ రాజకీయం చేయడం సరికాదని పలువురు మేధావులు సైతం తప్పుపట్టారు.
వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao)నిమ్స్‌లో ప్రీతిని సందర్శించిన అనంతరం చేసిన వ్యాఖ్యలు ఆయననే ఇరుకునపడేశాయి. తర్వాత ఆయన దాన్ని సరిదిద్దుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదంటూ విపక్ష నేతలు ఆరోపించారు.
దీనిపై మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ప్రతి విషయానికీ రాజకీయం చేయడం పార్టీలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అయితే.. ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చకుండా.. ప్రశ్నించిన తమపై విమర్శలు చేయడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇలా రాజకీయ పార్టీలు సైతం ఈ ఉదంతంలో మరకలు అంటించుకున్నాయి.
వివాదంలో విద్యార్థి సంఘాల తీరు
బయట నుంచి విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేయగా లోపల నుంచి వాస్తవాలు వెలుగులోకి రానివ్వండి అంటూ కాలేజీ పీజీ సీనియర్ విద్యార్థులు ఆందోళనకు పూనుకోవడం మరో చర్చకు దారి తీసింది. ఏకంగా సమ్మె నోటీసు ఇవ్వడం కూడా గమనార్హం. ఒకవైపు విద్యార్థి సంఘాలు, మరోవైపు కేఎంసీ విద్యార్థులు అన్నట్టుగా ఒక దశలో పరిస్థితి నెలకొన్నది.
సంఘటనకు సంబంధించిన సున్నిత విషయాలను పట్టించుకోకుండా వ్యవహరించారని విమర్శలు ఇరు వర్గాలపై వ్యక్తం అయ్యాయి. ప్రొఫెషనల్ విద్యార్థి సంఘాలు తప్పుడు మార్గంలో పోతున్నాయని విమర్శలు వ్యక్తం కాగా వాస్తవ సంఘటనలను పీజీ విద్యార్థులు విస్మరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.
గవర్నర్ కు తప్పని ఇబ్బంది
ప్రీతి సంఘటనపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ తమిళసై పరామర్శ సందర్భంగా పూలదండ తీసుకు వెళ్లారని అపవాదును ఎదుర్కొన్నారు. తర్వాత రాజభవన్ వర్గాలు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ విధంగా అన్ని వర్గాలు ప్రీతి మృతి ఘటనలో బద్నాం అయ్యాయి.