- ఒంటెత్తు పోకడలు పోతుందా?
- వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు
- అంతకు ముందే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు..
- రాహుల్ భారత్ జోడో యాత్రతో
- జవసత్వాలు కూడదీసుకున్న కాంగ్రెస్
- 24 నుంచి రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ
దేశంలో ఎన్నికల వాతావరణం దాదాపు వచ్చేసింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, వాటికి ముందు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటకతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నది. మొన్నటిదాకా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీగా తయారైందన్న అపవాదు మూటగట్టుకున్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తో ఎంతో కొంత ధీమాతో ఉన్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ క్యాడర్ కొంత ఉత్సాహంగా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ తన 85వ ప్లీనరీ సమావేశాలను ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. అయితే.. ఈ ప్లీనరీ సందేశం ఎలా ఉండబోతున్నది? ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఎలా రూపొందించుకోనున్నది? ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ.
విధాత: ఒకటి మాత్రం వాస్తవం. రాహుల్ జోడో యాత్ర ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఆశించేవి కాదు. రాత్రికి రాత్రి దేశ రాజకీయ పరిణామాలను మార్చగలిగేవీ కాదు. ఎందుకంటే ఇప్పటికీ దేశ ప్రజల్లో బీజేపీ రేపిన కుహనా జాతీయ వాదం బలంగానే వేళ్లూనుకుని ఉన్నది. ఇతర విమర్శల సంగతి ఎలా ఉన్నా.. మోదీ ఒక బలమైన నాయకుడిగా ముందుకు తేబడుతున్నారు.
ఇటువంటి కీలక సమయంలో 15 వేల మంది ప్రతినిధులతో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు.. ఆ పార్టీలో మెరుగైన అంతర్గత చర్చకు అవకాశం కల్పిస్తాయని రాజకీయ నిపుణులు ఆశిస్తున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ (Rahul Gandhi) చేపట్టకున్నా.. అన్నీ తానై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
దానికి తోడు రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ(Priyanka gandhi) కూడా పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల వ్యక్తిగతంగా కేంద్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఒక విధంగా అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కలిసి పార్టీకి పూర్వవైభవం తేవాలన్న తపనతో పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ పార్టీ చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా నిలిచిపోతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీలో సహజంగానే 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్‌ను (Road Map to 2024 General Elections) తయారు చేయడమే కీలక అజెండా కానున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనరల్ ఎలక్షన్స్‌కు ముందు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉన్నది.
భారీ ఏర్పాట్లు
సమావేశాలకు భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. నయా రాయ్‌పూర్‌లోని రాజ్యోత్సవ్ మైదానంలో ఏకకాలంలో 250 మంది కూర్చొనగలిగే సామర్థ్యంతో భారీ వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 15వేల మంది ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ఆరువేలకుపైగా హోటల్ గదులు, మరో 4 వేలకుపైగా ఛత్తీస్‌గఢ్ హౌసింగ్ బోర్డ్‌కు చెందిన ఫ్లాట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో ఫ్లాట్లలో అతిథులకు బస ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థతి వస్తే వైద్య సేవలు అందించేందుకు ఐదు పడకలతో ఒక హాస్పిటల్‌తో పాటు మొబైల్ మెడికల్ యూనిట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
24వ తేదీ నుంచీ ప్లీనరీ జరగనున్నా.. డెలిగేట్స్ సమావేశం మాత్రం 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. ముందు రోజు స్టీరింగ్ కమిటీ సమావేశమై.. తీర్మానాలు, ప్రతిపాదనలు, సభానిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌తోపాటు.. విద్య, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా చర్చించనున్నట్టు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. ఇతర అంశాలు చర్చించినా, 2024 ఎన్నికలకు అజెండా రూపొందించడం, పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రోడ్‌మ్యాప్ పైనే అందరి దృష్టి
2024 ఎన్నికలకు కాంగ్రెస్ రోడ్‌మ్యాప్ ఎలా ఉండబోతున్నదనే దానిపైనే ఇప్పడు సహ ప్రతిపక్షాలు కూడా దృష్టి పెట్టాయి. తోటి ప్రతిపక్షాలతో కాంగ్రెస్ ఎలా సమన్వయం చేసుకుంటుంది? అనేది అత్యంత కీలకమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గడిచిన పదేళ్లలో మోదీ పాలన అంతా డొల్లేనని అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రత్యేకించి కొవిడ్ అనంతరం కాలంలో ఉపాధి అనేది అత్యంత కీలకంగా మారింది. నిరుద్యోగం (Unemployment) పెరిగిపోయింది. ధరలు (Prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతకు ముందు తెచ్చిన పెద్ద నోట్ల రద్దు (Notebandi) అట్టర్‌ఫ్లాప్ అయింది. పెద్ద నోట్లు రద్దు చేసిన నాటికి మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లలో దాదాపు అన్నీ బ్యాంకులకు చేరిపోయాయి.
ఏతావాతా ఆ కాలంలో ఇబ్బంది పడింది ఎవరంటే.. సాధారణ పేద, మధ్యతరగతి ప్రజలే. క్యూ లైన్లలో నిలబడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు కూడా చూశామని పలువురు రాజకీయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. జీఎస్టీకి ఒక నికరమైన పద్ధతంటూ లేకుండా పోయింది. ఆఖరుకు పెన్సిల్ షార్ప్‌నర్లపై జీఎస్టీ (GST) తగ్గించి అదే గొప్ప అనుకునే పరిస్థితి.
విపక్షాల ఐక్యతే ప్రధానం..
ఇవన్నీ మోదీకి వ్యతిరేకత తెప్పించాయి. అయితే.. ప్రజల్లో ఇటువంటి వ్యతిరేకతలను కప్పి పెట్టేందుకు బీజేపీ ఎన్నికల వేళలో మతోన్మాదం కార్డును బయటకు తీస్తుందనేది బహిరంగ రహస్యమే. ప్రస్తుతం కర్ణాటకలో పేలుతున్న విద్వేష వ్యాఖ్యలే (Hate Speech) ఇందుకు నిదర్శనం. వీటన్నింటినీ కౌంటర్ చేయడంతోపాటు.. విపక్షాలు అన్నీ ఒక్కతాటిపైకి రావడం అనేది ఇప్పడు జాతీయ అవసరంగా కనిపిస్తున్నది.
ఈ సమయంలో కాంగ్రెస్ తన వంతు పాత్ర ఎలా పోషించనున్నది అనేది అత్యంత కీలకంగా మారింది. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు చేస్తారా? లేక ఎన్నికల తర్వాతనా అనే సంగతి పక్కనపెడితే.. ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో విపక్షాలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇందులో కాంగ్రెస్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటుందా? లేక ఒంటెత్తు పోకడలు అనుసరిస్తుందా? అనేది తేలాల్సి ఉన్నది.
ప్లీనరీలో ఈ విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఏది ఏమైనా మతోన్మాద బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత అన్నింటికంటే ముఖ్యమని పేర్కొంటున్నాయి. భారత్ జోడో యాత్ర సమయంలో అనేక మంది విపక్ష నాయకులు రాహుల్‌తో కలిసి నడిచారు. కాంగ్రెస్‌కు ఇదొక పాజిటివ్ అంశమని పరిశీలకులు అంటున్నారు. దీన్ని కాంగ్రెస్ మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నారు.
ప్రాంతీయ పార్టీలతో మైత్రి కీలకాంశం
బీజేపీ అధికారంలోకి రాకముందు అనేక రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలకు (Regional Parties) ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ప్రాంతీయ శక్తులతో పొత్తులు పెట్టుకున్నా.. ఎప్పుడూ ‘పెద్దన్న పాత్ర’ పోషిస్తుందనే విమర్శలు ఉన్నాయి.
చాలా మంది నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నా.. తామేదో జాతీయ స్థాయి నాయకులమన్న భావనతో ఉంటారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇదే ఆ పార్టీతో అసలు సమస్య అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
తమ వ్యక్తిగత ప్రయోజనాలకంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని సదరు నాయకులు గుర్తిస్తే తప్ప కాంగ్రెస్ కీలకంగా ఎదగలేదని అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన అంశం ఇదేనని చెబుతున్నారు.
కాంగ్రెస్ తన బలాన్ని గుర్తించాలి
కాంగ్రెస్‌ను దెబ్బతీసే బీజేపీ ఎదిగింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి.. తమ శక్తిని చాటుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ అయిష్టత చూపితే నష్టపోయేది ఆ పార్టీయేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
తన వాస్తవ బలాన్ని గుర్తెరిగి.. అందరినీ కలుపుకొని పోయే పక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు 2024 ఎన్నికల తర్వాత ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహించే అవకాశం కలుగుతుంది. లేని పక్షంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ మేధోమథనం చేసుకోవాల్సి వస్తుంది.