- పన్ను ఎగవేత వాస్తవం కాదు
- నిధుల మళ్లింపు అవాస్తవం
- బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత మూడు రోజులుగా బాలవికాస సంస్థలో జరిగిన ఐటీ సోదాలు దురదృష్టకరం, బాధాకరమని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది రాష్ట్రాలలో కుల, మత ప్రాంత, రాజకీయాలకు అతీతంగా బాలవికాస సంస్థ ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ, కోటి జీవితాలకు తోడ్పాటును అందిస్తుందన్నారు. కాజీపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అవినీతి అక్రమాలకు తావు లేకుండా సంస్థ నడుస్తున్నందున, ఇబ్బంది లేకుండా ఐటీ సోదాలు ముగిసాయని తెలిపారు. ఐటీ అధికారులకు సహకారం అందించామని చెప్పారు. సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలియచేశారు. ఏ నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. సంస్థకి 400 కోట్ల రూపాయల నిధులు ఒకే సంవత్సరంలో వచ్చినట్టుగా చెప్పడంలో నిజం లేదన్నారు.
గత 45 సంవత్సరాలుగా సంస్థ చేసిన అనేక రకాల పథకాల విలువగా గుర్తించాలన్నారు. నేను సంస్థ నిధులతో సొంత ఆస్తులను పెంచుకున్నట్టు చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. సంస్థకు పన్ను మినహాయింపు వుంటుంది కాబట్టి, ఎగవేత సమస్య ఉత్పన్నం కాదని శౌరెడ్డి స్పష్టం చేశారు.