Amaravathi
- అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వొచ్చు
- జగన్ నిర్ణయానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
విధాత: జగన్ కు మంచి బూస్టప్ ఇచ్చే వార్త ఇది.. అటు రైతుల మాటున అమరావతి కార్యాచరణ వేదిక, తెలుగు దేశం పార్టీకి మింగుడు పడని వార్త. అమరావతిలో భారీ ఎత్తున పేదలకు సెంటు చొప్పున ఇంటి జాగా ఇవ్వడానికి నిర్ణయించుకున్న జగన్ మొత్తం 1402 ఎకరాల భూమిని సీఏఆర్డీఏ నుంచి కొనుగోలు చేసి మంగళగిరి, ఉండవల్లి నియోజకవర్గాల్లో దాదాపు 50 వేల మంది పేదలకు సెంటు భూమి చొప్పున ఇంటి జాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే రాజధాని అమరావతి ఏరియాలో పేదలకు స్థానం లేదని, వారికి అక్కడ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించడం తగదని టిడిపి, దాని మద్దతుదారులైన రైతులు హైకోర్టులో పిటిషన్ వేయగా అది చెల్లలేదు. అక్కడ పేదలకు మద్దతుగా తీర్పు వచ్చింది. దీంతో జగన్ రెట్టించిన ఉత్సాహంతో ముందు కొనుగోలు చేసిన 1134 ఎకరాలతో బాటు మరో 268 ఎకరాలు సమీకరించి మొత్తం పేదల ఇళ్ల స్థలాలుగా చేయాలనీ చూసారు.
అయితే ఈలోపు అమరావతి పెద్ద రైతులు.. టిడిపి నాయకులూ ఆ కేసును సుప్రీం కోర్టు వరకూ తీసుకెళ్లగా అక్కడ కూడా వారికీ చుక్క ఎదురైంది. అమరావతి ఏరియా (R – 5 ) ఏరియాలో పేదలకు ఇల్లు ఇవ్వవచ్చని, దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీం తేల్చి చెప్పడంతో టిడిపి డీలా పడింది.
అమరావతిలో పేదలకు సైతం ఇళ్ళు ఇవ్వాలని భావిస్తూ జగన్ సర్కార్ జీవో 45 తీసుకువచ్చింది. అయితే అమరావతిలో పేదల ఇళ్ళు ఉండరాదంటూ కొందరు రైతుల ముసుగులో టిడిపి కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. దీనికి మొన్న హై కోర్టు ఉత్తర్వులు ఇస్తూ అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇవ్వడాన్ని ఎలా ఆపుతాం అని, అసలు అవి రైతుల భూములు కావని సీఆర్డీఏ భూములు కావడంతో అవి ఎవరికీ ఇచ్చుకున్నా తాము ఆపలేమని కోర్టు తేల్చేయడంతో చంద్రబాబు వర్గం డీలాపడింది.
రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం జీఓ నంబర్ 45 ఇస్తూ సీఆర్‌డీఏ నుంచి ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు జిల్లాల కలెక్టర్లకు 1134.58 ఎకరాల భూమిని బదిలీ చేసింది. దీనికి గాను ప్రభుత్వం సీఆర్డీఏ నుంచి భూమిని రూ.1100 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. మొత్తం పది లేఔట్లలో 48,379 మంది పేదలకు సెంటు చొప్పున ఇంటి జాగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిని కోర్టు కొట్టివేయడంతో అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇవ్వాలన్న సీఎం వైయస్ జగన్ సంకల్పానికి మార్గం సుగమం అయినట్లు అయింది . ఈ ఇళ్ల కేటాయింపును అడ్డుకునేందుకు టిడిపి మద్దతుదారులైన మీడియా సంస్థలు సైతం శక్తివంచన లేకుండా ప్రయత్నించినా చివరికి పేదలే గెలిచారు.
ప్రధానంగా జగన్ సర్కార్ రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లాలోని 24,587 మంది లబ్ధిదారులకు ఐనవోలు, మందడం, కురగల్లు, నిడమర్రులోనూ, అలాగే గుంటూరు జిల్లాలోని 24,152 మంది లబ్ధిదారులకు మందడం, కృష్ణాయపాలెం, నవులురు, ఐనవోలు, నిడమర్రులో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పది లేఔట్లు కూడా సిద్ధం చేశారు.
ఐతే దీన్ని అడ్డుకునేందుకు టిడిపి చేసిన ప్రయత్నం కోర్టులో వీగిపోయింది. అయితే ఇప్పుడు ఈ రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు దీన్ని వైసిపి పేదల విజయంగా చెబుతోంది. తాము పేదలను సైతం అమరావతిలో భాగస్వాములను చేస్తుంటే టిడిపి అడ్డుకుంటోందని ప్రచారం చేస్తోంది. ఈ అంశం ఇప్పుడు టిడిపికి తలనొప్పిగా మారింది.
ఒకవేళ అడ్డుకుంటే జగన్ ప్రభుత్వం ఎదురు దాడి చేసేందుకు రెడీగా ఉంది.. చూసారా మేం మీకు ఇల్లు ఇస్తాం అంటే టిడిపి అడ్డుకుంటోంది అని ప్రజలను రెచ్చగొట్టేందుకు ఒక అస్త్రంగా పనికొస్తుంది. ఒకవేళ మళ్ళి ఇక్కడ లోకేష్ గానీ పోటీ చేస్తే ఆయనకు దాదాపుగా యాభైవేలమంది ఇళ్ల లబ్ధిదారులు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. దీంతో టిడిపికి ఇటు నుయ్యి… అటు గొయ్యి అనేలా మారింది.