- మాతాజీ, పితాజీ కన్నా ఏ జీ గొప్పది కాదు
- విద్యార్థులు తల్లిదండ్రుల త్యాగాన్ని మరువరాదు
విధాత: గుజరాత్లోని పండిత్ దీనదయాల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యువతరం అంతా 4జీ, 5జీల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీరు మాతాజీ, పితాజీలను మరిచి 5జీ గురించి ఆలోచించొద్దని’ పిలుపునివ్వడం ఆసక్తిగా మారింది.
ముఖేశ్ అంబానీ ఎక్కడైనా, ఎప్పుడైనా వ్యాపారం, లాభాల గురించే మాట్లాడుతారనే భావన ఉన్నది. అందుకు భిన్నంగా ఆయనలో మానవీయ దృక్పథం ఉన్నదని చాటుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల త్యాగాన్నీ మరువకూడదు. మీ కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. డిగ్రీ పట్టాలు అందుకొంటున్నఈ తరుణంలో ఈ స్టేజీ పైకి రావాల్సిన వారు నిజంగా మీ తల్లిదండ్రులు. మీ ఉన్నతికి కారణం వారి త్యాగం. నిజంగా ఈ గౌరవం అంతా వారికే చెందాలని’ పిలుపునిచ్చారు.
ఆధునిక భారత చరిత్రలో అభివృద్ధికి సంకేతంగా అంబానీ పారిశ్రామిక గ్రూపును చెబుతారు. దేశంలోనే అతిపెద్ద కుబేరుడిగా ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఇవ్వాళ.. ముఖేశ్ అంబానీ మానవ విలువ గురించి విద్యార్థులకు ఇచ్చిన సందేశం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది.