Third Front
- మూడవ ప్రత్యామ్నాయానికి అవకాశాలేవి?
- బీజేపీని నిలువరించగలిగేది కాంగ్రెస్ ఒక్కటేనా?
- తనను తాను నిరూపించుకుంటున్న కాంగ్రెస్
విధాత: దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ మానియా ఏమాత్రం పని చేయలేదు. దేశ ప్రధానిగా ఉన్న మోడీ ఏకంగా కర్ణాటకలోనే మకాం వేసి ప్రచారం చేసినా ప్రజలు స్వీకరించలేదు. ఇవే ఫలితాలు దేశమంతా వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ విపక్ష పార్టీలను, ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడింది.
దాదాపు 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ప్రభుత్వాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేశారు. ఐటి, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను విపక్ష పార్టీలపై ఉసికొల్పి విచక్షణా రహితంగా దాడులు చేయించారు. నేతలను జైళ్లల్లో పెట్టారు. చివరకు సుప్రీం కోర్టు కూడా మహారాష్ట్రలో ఉద్దవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చిన తీరును తప్పు పట్టింది. ఇలా మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనుసరించిన తీరు పట్ల దేశ ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉన్నది.
పడినా లేస్తున్న కాంగ్రెస్
కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత బీజేపీ పెద్దలు దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రచారం మొదలు పెట్టారు. ఒక ప్రాంతీయ పార్టీ స్థితికి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని లెక్కలు చెప్పే వారు. ఇలా బీజేపీ నేతలు దేశంలో ఎక్కడా కాంగ్రెస్ లేదన్న తీరుగా ప్రచారం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఎన్ని దెబ్బలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడిన కాంగ్రెస్.. పడి లేచిందని అంటున్నారు. దేశంలో రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి.
వారసత్వ పార్టీ ముద్రను తొలగించే యత్నం
వారసత్వ పార్టీగా, కుటుంబపార్టీగా కాంగ్రెస్‌పై ఉన్న ముద్రను తొలగించే ప్రయత్నం రాహుల్ గాంధీ చేపట్టారు. ఇందులో భాగంగానే ఆలిండియా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు నిర్వహించి, నేతలే అధ్యక్షుడిని ఎన్నుకునేలా చేశారు. అలా కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు అయ్యారు. తద్వారా కాంగ్రెస్ పార్టీపై కుటుంబ పార్టీగా ఉన్న ముద్రను తొలగించే ప్రయత్నం చేశారు.
భారత్ జోడో యాత్రతో ఫలితాలు మొదలు
మరో వైపు దేశ ప్రజలను ఐక్యం చేయాలన్న ఏకైక ఎజెండాతో రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన జోడో యాత్ర ప్రజలను ఆలోచింప జేసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మెజార్టీ పార్టీల నేతలు రాహుల్ ను కలిసి తమ సంఘీభావం తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలో రాహుల్ జోడో యాత్ర విజయంతమైంది. పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాహుల్ జోడో యాత్ర ప్రజల్లో ఒక చర్చకు దారి తీసింది.
ఒక వైపు జోడో యాత్ర, మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుందన్న సంకేతాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేపడుతున్న పోరాటాలన్నీ ప్రజల్లో పార్టీ పట్ల సానుకూల వాతావరణం వచ్చిందని ఆపార్టీ నేతలు చెపుతున్నారు. కాంగ్రెస్ బలోపేతం అవుతున్న ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్నప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు నాయకత్వం వహించాలని కాంగ్రెస్ అగ్ర నేతలను కోరుతున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్‌కుమార్, డిప్యూటీ సీఎం, ఆర్‌జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌లు పలు సార్లు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీని కలిసి బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటుపై చర్చించారు.
వీరితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లతో పాటు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి సిద్దమయ్యాయి. అలాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినప్పుడు దాదాపు 17 పార్టీలు రాహుల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇలా దేశంలో ఉన్న వివిధ పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్‌తో కలిసి నడువడానికి సిద్దం అవుతున్నాయి.
కాంగ్రెస్ రహిత కూటమికి నో
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరొక కూటమి ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం అంటూ బీహార్ సీఎం నితిష్‌కుమార్, తేజస్వీయాదవ్, అఖిలేష్ యాదవ్‌లతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలతో చర్చించారు. అయితే ఆ నేతలు కూడా కాంగ్రెస్‌తోనే బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి సాధ్యమంటూ సోనియా గాంధీని కలిశారు.
ప్రస్తుత రాజకీయ వాతవరణంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, తలపండిన నాయకులు అంతా బీజేపీకి వ్యతిరేకంగా నిలిచేది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి, కాంగ్రెస్ నాయకత్వంలోనే బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక విజయం.. ప్రత్యామ్నాయ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించే అర్హతను పెంచిందన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి.