విధాత: స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ప్రచారంలో పాల్గొంటూ.. మీరు వేసే ఓటు తనకు వేసినట్టేనని ప్రసంగించే ప్రధాని మోదీ (PM Modi) పర్యటనల ఖర్చుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలల్లో మోదీ పాల్గొన్న పర్యటనలకు సంబంధించి.. ఆయన బెంగళూరు కార్యక్రమానికి నగర సంస్థ రూ.24 కోట్లు ఒకసారి, రూ.56 కోట్లను మరోసారి ఖర్చు పెట్టింది. కలబురిగి పర్యటనకు రూ.11.18 కోట్లు, బెలగావి కార్యక్రమానికి రూ.17 కోట్లు, మరో సారి రూ. 36.43 కోట్లు స్థానిక ప్రభుత్వాలే ఖర్చు పెట్టినట్లు వివిధ వార్తా సంస్థలు ఆయా సందర్భాల్లో ప్రచురించాయి.
పూర్తి కాకుండానే ప్రాజెక్టులు
మరికొన్ని సందర్భాల్లో ఇంకా పూర్తి కాని ప్రాజెక్టులను ప్రచారానికి ఉపయోగించుకోవడానికి ప్రారంభించడం, కొన్ని సార్లు పూర్తి అయిపోయన ప్రాజెక్టులను ఎన్నికలు వచ్చే వరకు మొదలు పెట్టకుండా ఉండటం చేస్తున్నారని మోదీని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
ఉదాహరణకు బెంగళూరులో మోదీ ప్రారంభించిన సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ మోదీ 2022లో ప్రారంభించారు. నిజానికి అది మార్చ్ 2021లోనే ప్రజలకు సేవలందించడానికి అందుబాటులో ఉంది. అయినప్పటికీ ప్రధాని కార్యక్రమం కోసం దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు.
మోదీ గత నెలలో ప్రారంభించిన బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్ ది మరో కథ. దీని నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిసనప్పటికీ మోదీ దానిని ప్రారంభించేయడం విమర్శలకు దారి తీసింది.
రెండు రోజులకే ఆ కారిడార్‌లోని ఓ స్టేషన్ పైకప్పు నుంచి నీరు కారడం మొదలైనవి జరిగాయి. బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్ వేపై సైతం ఇదే తరహా ఆరోపణలున్నాయి. దీనిని ప్రధాని ప్రారంభించిన రెండు మూడు రోజుల్లోనే అక్కడక్కడా గుంతలు ఉన్నట్లు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
చెరిగిపోతున్న సన్నని గీత
మోదీ హయాంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల మధ్య ఉండే స్పష్టమైన గీత చెరిగిపోతోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ 2020 నవంబరులో జరిపిన హైదరాబాద్ పర్యటనను గుర్తుచేస్తున్నారు. మోదీ నగరానికి వచ్చిన నవంబరు 29 తర్వాత రెండు రోజులకే నగర ఎన్నికలు జరగనున్నాయి.
భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ తయారీని పరిశీలించడానికి వచ్చిన మోదీ.. ఎన్నికల గురించి ఒక్క మాట మాట్లాడకపోయినప్పటికీ మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా వల్ల అది ఎన్నికల పర్యటననే తలపించిందని వారు చెబుతున్నారు. ప్రస్తుత కర్ణాటక ఎన్నికల ప్రచారాన్నీ తన భుజాలకెత్తుకున్న మోదీ.. ప్రచార పర్వంలో భవిష్యత్తులో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ ఉంటారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.