Adilabad | తర్నంలో వరద ఉధృతిలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు తాళ్లసాయంతో రక్షించిన రెస్క్యూ టీం నిండుకుండలా ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల పట్టపగలే కమ్ముకున్న చిమ్మ చీకట్లు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: కుండపోత వానతో పల్లెలు తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా వాన దంచికొడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ద్రోణి మూలంగా భారీగా వర్షం కురుస్తోంది. అదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తర్నం వద్ద నిర్మాణంలో ఉన్న […]

Adilabad |
- తర్నంలో వరద ఉధృతిలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు
- తాళ్లసాయంతో రక్షించిన రెస్క్యూ టీం
- నిండుకుండలా ప్రాజెక్టులు
- గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- పట్టపగలే కమ్ముకున్న చిమ్మ చీకట్లు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: కుండపోత వానతో పల్లెలు తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా వాన దంచికొడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ద్రోణి మూలంగా భారీగా వర్షం కురుస్తోంది. అదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తర్నం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని వరద నీరు చుట్టిముట్టింది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బ్రిడ్జిపైనే ఇద్దరు కూలీలు చిక్కుకుపోయారు.
క్షణ క్షణం వరద ఉధృతి పెరగడంతో సహాయం కోసం కూలీలు ఆర్తనాదాలు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈత గాళ్లను కూడా రప్పించారు. వరదలో చిక్కుకుపోయిన కూలీలను బయటకు రప్పించేందుకు పలువిధాలా ప్రయత్నించారు. చివరకు తాళ్ల సహాయంతో వారు బయటపడగలిగారు.
గోదావరికి పోటెత్తిన వరద
నిర్మల్ జిల్లాలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మిట్టమధ్యాహ్నమే కారుచీకట్లు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా పగటిపూటనే వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. మబ్బులు కమ్మేయడంతో పాటు భారీగా కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పగటి పూటె చిమ్మచీకట్లు కమ్మేయడంతో వీధి లైట్లను వేయాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లాలోని పలుచోట్ల వర్షపాతం నమోదైంది.
బాసర వద్ద గోదావరి నదితోపాటు ప్రధాన ప్రాజెక్టులైన కడెం, భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుల్లోకి వరద నీటి ఉధృతి పెరిగింది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 696.450 అడుగులకు చేరింది. మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు. అటు భైంసా లోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఒక గేటు తెరిచి 3626 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు.
కొమురంభీం ఆసిఫాబాద్ లో..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహించిం ది. అందవెల్లి వద్ద పెద్దవాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకసారి కొట్టుకుపోగా, మరోసారి తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ వర్షానికి అది కూడా కొట్టుకుపోయింది.
వాగు తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకపోవడం మూలంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో సగటున 18.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెజ్జూరు మండలంలో 74 మిల్లీ మీటర్లు, అతి తక్కువగా చింతలమానేపల్లిలో 1.6 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది.
ప్రాజెక్టులు కళ కళ
మంచిర్యాల జిల్లాలోనూ వాన దంచికొట్టింది. మంచిర్యాల, భీమారం, జైపూర్, చెన్నూరు, వెన్నెల మండలాల్లో భారీగా వర్షం కురిసింది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళ ను సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను 18 980 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది. గోదావరి నుంచి ప్రాజెక్టులోకి 43538 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 43538 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు, మత్య్సకారులను అధికారులు అప్రమత్తం చేశారు.
