- తొక్కిసలాటల వెనుక కుట్రకోణమేదైనా ఉన్నదా?
విధాత: కందుకూరు ఘటన మరువక ముందే ఏపీలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజాయాత్రలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేంఖర్మ పేరుతో చంద్రబాబు చేపట్టిన యాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతిచెందారు.
ఐదు రోజులు గడువక ముందే గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చేపట్టిన వస్త్రాల పంపిణీలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు దుర్మరణం పాలు కావటం దిగ్బ్రాంతికరం. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన యాత్రలు చేపట్టడం సహజమే.
అయితే.. దానికి సంబంధించిన భద్రతా చర్యలు చేపట్టడం పోలీసులు బాధ్యతే కాదు, దానికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఆ కార్యక్రమ నిర్వాహకులకు కూడా ఉంటుంది. ఇందులో ఎవరు తప్పించుకోవాలని చూసినా బాధ్యతారాహిత్యమే.
ఈ రెండు ఘటనల్లో చంద్రబాబు తప్పంతా ప్రభుత్వానిదే అన్నట్లు మాట్లాడుతున్నారు! ఒక రాజకీయ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలకు అవసరమైన రీతిలో రక్షణ చర్యలు తీసుకోవటం పోలీసుల బాధ్యత. దీన్ని ఎవరూ కాదనలేరు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం ఏ స్థాయిలో ఉన్నదో విచారణ చేపడితే తేలిపోతుంది.
కానీ యాత్ర నిర్వహిస్తున్నప్పుడు అయినా, చంద్రన్న కానుక పంపిణీ చేపడుతున్నప్పుడు అయినా ప్రజలను ఏ స్థాయిలో, ఎంతమందిని సమీకరిస్తున్నామనేది కార్యక్రమ నిర్వాహకులకు తెలియకుండా ఉండదు. ఒక రకంగా.. ప్రజలను ప్రయత్నపూర్వకంగా సమీకరించే సంస్కృతే ఇప్పుడు కొనసాగుతు న్నది. ఇవి దీనికి అతీతం అనుకోవటానికి లేదు.
అయితే… ఊహించిన దాని కన్నా ఎక్కువ సంఖ్యలో జనం వచ్చారనీ, అందులో తమ తప్పేమీ లేదనీ చంద్రబాబు చెప్పుకొస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే జనం ఎక్కువ సంఖ్యలో రావటం అనేది తమపట్ల ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనమనే రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం నిస్సందేహంగా గర్హనీయం.
అధికార, ప్రతిపక్ష పార్టీలుగా వైఎస్ ఆర్ సీపీ, టీడీపీ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటంతోనే ఈ ఘోరాన్నుంచి వారు తప్పించుకోలేరు. తాము చేపడుతున్న కర్యక్రమాల కారణంగానే అమాయకులైన ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనే కనీస స్పృహ లేకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడ టం విడ్డూరం.
అదే సమయంలో సీఎం జగన్, అతని అనుచర గణం కూడా చంద్రబాబును విమర్శించ టంతోనే సరిపుచ్చుతున్నారు. తప్పంతా జగన్ పై తోసేసి చేతులు దులుపుకోవాలను కోవటం బాధ్యతారా హిత్యమే కాదు, నేరపూరిత నిర్లక్ష్యం కూడా.
ఇప్పటికైనా.. ప్రజల ప్రాణాల మీద ప్రేమ ఉన్నవారైతే.. జరిగిన ఘటనలపై నిష్పాక్షిత విచారణ చేపట్టాలి. ప్రమాదాలుగా కనిపిస్తున్న ఈ ఘోరఘటనల వెనుక ఉన్న చీకటి కోణాన్ని వెలికి తీయాలి. దోషులను శిక్షించాలి.
అన్ని విధాలుగా అన్ని సందర్బాల్లో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ బాధ్యత అధికార, విపక్ష పార్టీలు గుర్తించాలి, స్వీకరించాలి. లేకుంటే.. ప్రజలు ఈ పార్టీల తీరును చూసి ఇదేం ఖర్మరా అనుకొనే రోజు ఒకటి వస్తుంది.