- సీత జాడను కనుక్కొని రమ్మంటే.. లంకను కాల్చి వచ్చిన హనుమంతుడే స్ఫూర్తి: జై శంకర్
విధాత: సీత జాడను తెలుసుకొని రమ్మంటే… లంకనే కాల్చి వచ్చిన హనుమంతుడు, యుద్ధం జరుగకుండా ఓ ఐదూర్లు ఇచ్చినా సర్దుకుంటామన్న పాండవులతో యుద్ధం చేయించిన శ్రీకృష్టుడు దౌత్యవేత్తలుగా మనకు ఆదర్శం. ఈ మాటలు ఎవరో పురాణాల ప్రవచన కారులు అన్నవి కావు. ఏదో పురాణాల్లోని పాత్రల గొప్పతనాన్ని గూర్చి సాహితీ కారులు వెలుబుచ్చిన అభిప్రాయం అంతకన్నా కాదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ అన్న మాటలివి!
మోదీ కేంద్ర క్యాబినెట్‌లో విదేశీ వ్యవహరాల శాఖా మంత్రిగా జైశంకర్ పనిచేస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రిగా తన అనుభవాలను గుదిగుచ్చి… ది ఇండియా వే (స్ట్రాటజీస్ ఫర్ యాన్ అనసస్టేయిన్ వరల్డ్) అనే పుస్తకాన్ని రాశారు. దాని మరాఠీ అనువాదం భారత్ మార్గ్ పేరుతో మహారాష్ట్ర పూనేలో ఆవిష్కరణ జరిగింది.
ఆ ఆవిష్కరణ సభకు హాజరైన జైశంకర్… నేటికీ హన్మంతుడు, శ్రీకృష్టుడే దౌత్యవేత్తలుగా ఆదర్శమని చెప్పుకొచ్చాడు. ఆ ఆదర్శమంటే… ఎలానో కూడా ఆయనే సెలవిచ్చాడు… హన్మంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని చెప్తూ ఇదే ఆదర్శమన్నాడు. అలాగే యుద్ధం చేయబోను అన్న అర్జునునితో యుద్ధానికి ప్రేరేపించి కురుక్షేత్ర యుద్ధానికి కృష్ణుడు కారణమయ్యాడు. అలాంటి కృష్ణుడు ఇప్పుడు ఆదర్శమట!
బీజేపీ నేతలకు అంతా వేదాల్లో ఉన్నాయని అనటం రివాజు. కానీ ఓ అత్యున్నత అధికారిగా, ఆధునిక చదువులు చదివిన మాజీ బ్యూరాక్రాట్ అయిన ఆయన పురాణ పాత్రలను ఆధునిక కాలానికి ఆదర్శంగా చెప్పటం, అందులోనూ అపసవ్య, వ్యతిరేక పాత్రలకు ఆపాదించటం చర్చనీయాంశం అవుతున్నది.
బీజేపీ నేతలారా… పురాణ ఇతిహాసాలను నెత్తికెత్తుకుంటే.. ఎత్తుకోండి… కానీ అవి చెప్తున్న విలువలను కాస్త చూసుకోండి. లేకుంటే మొదలుకే మోసం వస్తుంది.