Asia Cup 2023 | విధాత: ప్రస్తుతం ఆసియా కప్ చివరి దశకు చేరుకుంది. సూపర్-4 దశలో పాక్, శ్రీలంకతో ఆడిన భారత జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే ఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే ఫైనల్‌లో మరోసారి భారత్ -పాక్ ఆడితే చూడాలన్నది ప్రతి ఒక్కరి కల. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడగా, పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో టీమ్ ఇండియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఇరు జట్లు […]

Asia Cup 2023 |
విధాత: ప్రస్తుతం ఆసియా కప్ చివరి దశకు చేరుకుంది. సూపర్-4 దశలో పాక్, శ్రీలంకతో ఆడిన భారత జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే ఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే ఫైనల్‌లో మరోసారి భారత్ -పాక్ ఆడితే చూడాలన్నది ప్రతి ఒక్కరి కల.
2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడగా, పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో టీమ్ ఇండియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఇరు జట్లు అనేక టోర్నీల్లో తలపడినప్పటికి ఫైనల్‌లో మాత్రం ఆడలేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఇంతవరకు ఎప్పుడూ పోటీ పడలేదు.
1984లో ఆసియా కప్ టోర్నీ మొదలు కాగా, భారత జట్టు మొత్తం 10 సార్లు ఫైనల్ కి చేరుకుంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా 5 సార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, ఫైనల్స్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇంత వరకు తలపడలేదు. ఈ ఏడాది ఆసియా కప్‌లో రెండు జట్లు పోటీ పడతాయని అందరు భావించారు.
కానీ శ్రీలంక అభిమానుల ఆశలపై నీరు చల్లింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌ని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అయితే ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ చాలా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది శ్రీలంక జట్టు.
గురువారం పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో వర్షం కారణంగా 42 ఓవర్లు మాత్రమే ఆడించారు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 7 వికెట్లు కోల్పోయి 252 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. రిజ్వాన్, ఇఫ్తికర్ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేయడంతో ఈ స్కోరు నమోదు చేసింది.
ఇక ఈ లక్ష్యాన్ని చేధించేందుకు శ్రీలంక గట్టిగానే ప్రయత్నం చేసింది. మెండీస్ 91 పరుగులతో శ్రీలంక విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. చివరి దశలో శ్రీలంక విజయానికి 9 బంతుల్లో 9 పరుగులు కావాల్సి ఉండగా, ధనంజయ డిసిల్వ ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికి ఫామ్‌లో ఉన్న దునిత్ వెల్లలాగే కూడా అవుట్ అయ్యాడు. వరుసగా 2 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిదీ మ్యాచ్‌ని పాక్ వైపు తిప్పాడు.
అయితే ఆ సమయంలో శ్రీలంక విజయానికి 7 బంతుల్లో 9 పరుగులు కావాల్సి ఉండగా,. ప్రమోద్, ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. దీంతో చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే తొలి బంతి సింగిల్ తీయగా, రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది. నాలుగో బంతికి బంతిని మిస్ చేసి, లేని రన్ కోసం ప్రయత్నించిన ప్రమోద్ రనౌట్ అయ్యాడు.
చివరి 2 బంతుల్లో లంక విజయానికి 6 పరుగులు కావాల్సి ఉండగా, ఐదో బంతికి ఫోర్ బాదిన చరిత్ అసలంక, ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు తీసాడు.దీంతో 8 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌పై శ్రీలంకకి ఘన విజయం దక్కింది. ఈ విజయంతో శ్రీలంక ఫైనల్‌లో భారత్‌ని ఢీకొట్టనుంది.
