Asia Cup | ఫైన‌ల్లో అతిథ్య జట్టు శ్రీలంకను చిత్తుచేసిన‌ టీమిండియా 10 వికెట్లతో తేడాతో ఘనవిజయం కొలంబో: ఆసియా క‌ప్‌-2023లో టీమిండియా అదరగొట్టింది. ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకపై ఘన విజయం సాధించి ఎనిమిదో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీ‌లంక‌ను జ‌స్ప్రిత్ బుమ్రా మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ తీసి బోణీ చేయ‌గా, త‌రువాత మ‌హ్మ‌ద్ సిరాజ్ రికార్డు స్థాయిలో 21 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు (ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు) […]

Asia Cup |

  • ఫైన‌ల్లో అతిథ్య జట్టు శ్రీలంకను చిత్తుచేసిన‌ టీమిండియా
  • 10 వికెట్లతో తేడాతో ఘనవిజయం

కొలంబో: ఆసియా క‌ప్‌-2023లో టీమిండియా అదరగొట్టింది. ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకపై ఘన విజయం సాధించి ఎనిమిదో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీ‌లంక‌ను జ‌స్ప్రిత్ బుమ్రా మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ తీసి బోణీ చేయ‌గా, త‌రువాత మ‌హ్మ‌ద్ సిరాజ్ రికార్డు స్థాయిలో 21 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు (ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు) తీసి శ్రీ‌లంక టాప్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు.

త‌రువాతి ఓవ‌ర్ల‌లో బుబ్రా మంత్రం ఫ‌లించ‌క‌పోవ‌డంతో బౌలింగ్ తీసుకున్న హార్దిక్ పాండ్యా కూడా మూడు ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు తీసి శ్రీ‌లంక‌ను ఆల్ ఔట్ చేశారు. 15.2 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగులు చేసిన శ్రీ‌లంక భార‌త్‌కు 51 ప‌రుగుల టార్గెట్ పెట్టింది. దీంతో ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ శ్రీలంకతో ఏకపక్షంగా జరిగింద‌నే చెప్పాలి.

ఈ ఫైనల్ పోరులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీలంక విసిరిన 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు గిల్‌, ఇషాన్ కిష‌న్‌లు 6.1 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని సునాయసంగా పూర్తి చేశారు. 263 బంతులు, 10వికెట్ల తేడాతో శ్రీ‌లంక‌పై తిరుగులేని విజ‌యాన్ని భార‌త్ సొంతం చేసుకుంది.

ఏడేళ్ల త‌రువాత ఆసియా క‌ప్ గెలిచిన భార‌త్‌

భారత జట్టు చివరి సారిగా రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలోనే 2016లో ఆసియా కప్ గెలిచింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడు అంటే ఏడేళ్ల‌ తర్వాత అదే రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీమిండియా రెండోసారి ఆసియా కప్ గెలుచుకుంది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది ఎనిమిదో సారి. భారత్ గతంలో 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018లో ఆసియా కప్ విజేతగా నిలిచింది. దీంతో అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన రికార్డును భారత్ సొంతం చేసుకుంది.

రోహిత్ త‌ప్పుకుని ఇషాన్‌కు ఓపెన‌ర్‌గా అవ‌కాశం

శ్రీ‌లంక భార‌త్ ముందు కేవ‌లం 51 ప‌రుగుల ల‌క్ష్యంగా ఉంచింది. లక్ష్యం చిన్నది కావడం వ‌ల్ల‌ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెన‌ర్‌గా బ్యాటింగ్ చేయ‌కుండా ఆ స్థానంలో ఇషాన్ కిష‌న్‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ జట్టును సునాయసంగా గెలిపించారు. 3వ ఓవర్‌లో బౌలింగ్ చేసిన ప్రమోద్ మదుషన్ బాల్స్‌కు హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు గిల్‌.

శ్రీ‌లంక టాస్ గెలిచింది.. మ్యాచ్ ఓడింది

ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక మ్యాచ్ మాత్రం ఘోరంగా ఓడి పోయింది. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ కొద్ది ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. ఇదే భార‌త్ బౌల‌ర్ల‌కు క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్‌కు పిచ్ బాగా అనుకూలిం చింది. దీంతో ఆరంభ ఓవ‌ర్ల‌లోనే శ్రీ‌లంక‌కు దెబ్బ మీద దెబ్బ చావు దెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌కు శ్రీ‌లంక టాప్ ఆర్డ‌ర్ గజగజ వణికింది.

ఫ‌స్ట్‌ ఓవర్ బౌలింగ్ చేసిన జస్రీత్ బుమ్రా శ్రీలంక ఓపెన‌ర్‌ కుశల్ పెరీరాను డకౌట్ చేశాడు. బుమ్రా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ డైవ్ చేసి ప‌ట్టేశాడు. తరువాత రంగంలోకి దిగిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌తో శ్రీలంక పరిస్థితి ఓవ‌ర్ ఓవ‌ర్‌కు దారుణంగా త‌యారైంది. సిరాజ్ వేసిన రెండో ఓవర్ మేడిన్ కావ‌డం విశేషం. నాలుగ‌వ ఓవ‌ర్‌లో సిరాజ్ త‌న విశ్వ‌రూపం చూపించాడు. ఏకంగా 4 వికెట్లు తీసి శ్రీ‌లంక ఆశ‌ల‌ను స‌మాధి చేశాడు.

ఆ ఓవ‌ర్‌లో నిసాంక(2), సదీర సమరవిక్రమ(0), చరిత అసలంక(0), ధ‌నుంజయ డిసిల్వాను(4) పెవిలియన్ చేర్చాడు. శ్రీలంక 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతికే నిసాంక ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా అద్భుతంగా ప‌ట్టుకున్నాడు. రెండో బంతి డాట్ అయింది.

మూడో బంతికి సమర విక్రమ లెగ్‌బైస్‌లో ఔట్ అయ్యాడు. నాలుగో బంతికి అసలంక ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ సునాయాసంగా ప‌ట్టుకున్నాడు. ఐదో బంతి ఫోర్ వెళ్లింది. ఆరో బంతికి డి సిల్వా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లోకి తీసుకున్నాడు. సిరాజ్ కెరీర్‌లోనే ఇది డ్రీమ్ స్పెల్‌గా నిలిచిపోయింది.

ఆరో ఓవర్‌లో సిరాజ్ త‌న బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండానే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 12 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. పన్నెండో ఓవర్‌లో మరోసారి రెచ్చిపోయిన సిరాజ్‌…కుశల్ మెండీస్(17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే దునిత్ వెల్లలాగేను(8)ను హార్దిక్ ఔట్ చేశాడు. దీంతో 40 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది శ్రీ‌లంక‌.

16వ ఓవర్ మొదటి రెండు బంతులకే ప్రమోద్ మదుషన్(1), మతీషా పతిరాన(0)ను పెవిలియను చేర్చాడు హార్దిక్ పాండ్యా. దీంతో 15.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక వన్డే చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోర్, వన్డేల్లో టీమిండియాపై ఓ ప్రత్యర్థి సాధించిన అత్యల్ప స్కోర్ కూడా ఇదే.

లంక బ్యాటర్లలో 13 పరుగులు చేసిన దుషన్ హేమంత నాటౌట్‌గా నిలిచాడు. 17 పరుగులు చేసిన కుశల్ మెండీసే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదు డకౌట్ల‌లో మూడు సిరాజే త‌న ఖాతాలో వేసుకొన్నాడు. మొత్తంగా సిరాజ్ ఏడు ఓవ‌ర్ల‌కు 21 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్ల తీసుకున్నాడు. 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. 5 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

భార‌త్ మ‌రిన్ని రికార్డులు..

  • భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్ సిరాజ్‌. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఉన్నారు.
  • వన్డే ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరు (50) నమోదు చేసిన జట్టుగా శ్రీలంక అవతరించింది.
  • గతంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 54 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఇప్పుడా రికార్డును శ్రీలంకనే తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
  • వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇ
  • 2012లో దక్షిణాఫ్రికాపై 43 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్‌ (2023) మీద త్రివేండ్రం వేదికగా 73 పరుగులే చేసింది.
  • వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన సిరాజ్‌.. ఆసియా కప్‌లోనూ రెండో బెస్ట్‌ ప్రదర్శన కావడం విశేషం.
  • శ్రీలంక మాజీ బౌలర్ అజంత మెండిస్ (6/13), తర్వాత సిరాజ్‌ 6/21 స్పెల్‌తో రెండో స్థానంలో నిలిచాడు.
  • ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లను భారత పేసర్లే తీయడం మ‌రో విశేషం.
Updated On 17 Sep 2023 2:07 PM GMT
krs

krs

Next Story