- వరంగల్‌లో అరెస్టు, వికారాబాద్ తరలింపు
- శాంతించని అయ్యప్ప భక్తులు..
- పీడీ యాక్ట్ పెట్టాల్సిందేనని డిమాండ్
విధాత: అయ్యప్ప స్వామి పుట్టుకపై భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. అయ్యప్పను కించ పరిచే విధంగా మాట్లాడిన నరేశ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో ఇప్పటికే ఆయనపై 16 కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో.. బైరి నరేశ్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్టు చేసి వికారాబాద్‌కు తరలించారు. అక్కడి కోర్టులో ఆయనను హాజరుపరిచి జైలుకు తరలించినట్లు తెలుస్తున్నది. ఆయన అనుచరుడు హనుమంతును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. రేంజర్ల రాజేశ్‌ను నిజామాబాద్‌లో అరెస్టు చేశారు.
వికారాబాద్ సమీపంలోని ఓ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న బైరి నరేష్ అయ్యప్ప స్వామి పుట్టుక ఉదంతాన్ని విప్పి చెప్పారు. శివుడు, హిరి అనే దేవతల అంశతో అయ్యప్ప పుట్టాడని ఇతిహాసం చెబుతున్నది. దీన్ని ఆయన తనదైన శైలిలో ఇద్దరు పురుషులకు అయ్యప్ప ఎలా జన్మించాడంటూ వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆ మాటలతోనే రాష్ట్రం అట్టుడుకుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులు రోడ్లపైకి వచ్చి బైరి నరేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ మనోభావాలను గాయపర్చాడని ఆగ్రహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు పరిస్థితి తీవ్రతను గమనించి బైరి నరేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, జైలుకు తరలించారు. అయినా అయ్యప్ప భక్తులు శాంతించటం లేదు.
హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు, ఘర్షణలు పెంచే విధంగా మాట్లాడిన నరేశ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకరు హిందూ భావాలను విమర్శించేలా మాట్లాడకుండా బైరి నరేశ్‌కు శిక్ష పడాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు. అప్పటివరకు తమకు శాంతి లేదని స్పష్టం చేశారు.