సొంతపార్టీలోనే అసంతృప్తి
విధాత: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టు చేస్తారట.. చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అన్న బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) నేతలు భగ్గుమంటున్నారు. నిత్యం హిందూ ధర్మం, సంస్కృతి సంప్రాయాలు, రాముడు, రామరాజ్యం అనే ఒక ప్రజాప్రతినిధి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
లిక్కర్ స్కాం (Liquor scam) తో కవిత తెలంగాణ సమాజంలోని మహిళలు తల దించుకునేలా చేశారు అని ఆయన విమర్శలపై అధికార పార్టీ నేతలు, ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీలోని ఈటల రాజేందర్, రఘునందన్ లాంటి వారికి సంజయ్ కామెంట్లు కొత్త చిక్కులు తెచ్చిపెడుతాయి అంటున్నారు.
ఎందుకంటే సుదీర్ఘకాలంలో జరిగిన ఉద్యమంలో వాళ్లు నిత్యం టీవీ డిబెట్లలో పాల్గొనేవారు. ఎంత రెచ్చగొట్టినా ధీటుగా సమాధానం ఇచ్చేవారు. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యంగా మహిళా నేతలతో డిబేట్లలో చాలా జాగ్రత్తగా మాట్లాడేవారని గుర్తుచేస్తున్నారు.
అంతెందుకు మొన్నటికి మొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులపై తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభాసు పాలయ్యారు. ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించి ఆయన వివరణ తీసుకున్నది. చివరికి ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిజానికి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా అయిన నాటి నుంచే ఆ పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి.
విజయశాంతి (Vijayashanti) వంటి నేతలు తన సేవలను పార్టీ సరిగా వాడుకోవడం లేదని రాష్ట్ర నాయకత్వ వైఖరే దీనికి కారణమని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో విచారణ సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నా.. పౌర సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ సంజయ్, లేదా ఆ పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలను అన్నివర్గాలు తప్పుపడుతున్నాయి.
చట్టం ముందు సమానులే తప్పులు చేసిన వారు ఎవరైనా శిక్షార్హులే అని పౌర సమాజం ఇప్పటికీ విశ్వసిస్తున్నది. ఈ కేసులో ఎవరి పాత్ర ఏమిటి అన్నది రోజూ వార్తల్లో వస్తున్నాయి. కానీ బండి సంజయ్ తాజాగా అనుచిత వ్యాఖ్యలు చేసి అధికారపార్టీకి అవకాశం ఇచ్చారని సొంతపార్టీలోనే ఆయన వ్యవహారశైలిపై మండిపడుతున్నారట.
సంజయ్‌తో పార్టీకి జరుగుతున్న మేలు కంటే కీడే ఎక్కువ అని నేతలు, కార్యకర్తలు వాపోతున్నారట. అధికారపార్టీకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాట ఫలితాన్ని సంజయ్ అప్పుడప్పుడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన కమిషన్ విచారణకు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనున్నది.