విధాత: పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని పనికిరాని టీఎస్పీఎస్సీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని, పేపర్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వ తప్పు లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరపడం లేదో కేటీఆర్ చెప్పాలని బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాజకీయ కుట్ర కోణమంటూ మంత్రి కేటీఆర్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. మంచి అయితే వారిది.. చెడు అయితే బీజేపీది అన్నట్లుగా కేటీఆర్ వైఖరి ఉందన్నారు.
పేపర్ లీకేజీలో నిందితులు రేణుక తల్లి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అని, ఆమె కుటుంబం కోసమే పేపర్ లీకేజీ జరిగిందన్న విషయం కేటీఆర్ మరవరాదన్నారు. గతంలో 27 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కేటీఆర్‌దే అన్నారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మలు పరీక్షలు రద్దు చేశారన్నారు.
తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలని, చైర్మన్‌ను అరెస్ట్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసును ప్రభుత్వం నీరు గారిచే కుట్ర చేస్తుందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు పోసుకుందని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయిన బండి సంజయ్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా ఆయన తెలిపారు. తప్పు చేయనప్పుడు విచారణకు వెళ్లాల్సిందేనని, నా స్టేట్మెంట్ మహిళా కమిషన్ రికార్డ్ చేసుకుందన్నారు.