Kerala boat accident |
- పరిమితికి మించి ప్రయాణికులు
- లైఫ్ జాకెట్లు లేవు.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా లేదు
- మరి తనిఖీ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు?
విధాత: కేరళలోని మలప్పురం పడవ ప్రమాదానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ ఘటనలో 22 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఏమీ నిర్ధారణ కాకున్నా.. పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడం ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచలేదన్న వార్తలు కూడా వస్తున్నాయి.
డబుల్ డెక్కర్ పడవ ప్రమాదానికి గురైన సమయంలో అందులో 40 మంది టికెట్లతో, మరికొంత మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని సమాచారం. సహాయ కార్యక్రమాలు ముగిసిన తర్వాత దర్యాప్తు మొదలు పెడతామని పోలీసులు తెలిపారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడం కారణం అయి ఉండొచ్చని, అయితే ఇప్పుడే దానిని నిర్ధారించలేమని పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత దాని యజమాని నాజర్ పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఆరు తర్వాత రూల్సు ఒప్పుకోవు
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఘటన జరిగి ఉండొచ్చని ఐయూఎంఎల్ ఎమ్మెల్యే పీకు కున్హళికుట్టి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత పడవలు నడపకూడదని, ఈ ఘటనలో ఈ నిబంధన కూడా ఉల్లంఘించినట్టు కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. ఐదింటికల్లా ఓడ్డుకు చేరాల్సిన పడవ.. 7.30 గంటల సమయంలో నీటిలో మునిగిపోయింది.
చేపల పడవ.. టూరిస్టు సర్వీసులు
చేపల వేటకు ఉపయోగించే పడవను దాని యజమాని టూరిస్టు సర్వీసుగా మర్చాడని తెలుస్తున్నది. ప్రతి టూరిస్ట్ బోటుకు ఉండాల్సిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, సేఫ్టీ సర్టిఫికెట్ కూడా దానికి లేవని అధికారులు చెబుతున్నారు.
40 మంది టికెట్లతో.. మరికొందరు టికెట్ లేకుండా
బోటులో 30 మంది ప్రయణించే అవకాశమే ఉన్నా.. 40 మంది టికెట్‌లతో, మరికొంతమంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని అనధికారిక సమాచారం. ఎలాంటి రక్షణలు లేకుండా బోటు తిరుగుతున్నదని, అందులో ప్రయాణించేవారికి లైఫ్ జాకెట్లు కూడా అందించలేదని తెలుస్తున్నది.
అయితే.. పర్యాటకులు ప్రయాణించే బోట్లను ఎప్పటికప్పడు తనిఖీలు చేయాల్సిన అధికారులు ఈ బోటును ఎందుకు పట్టించుకోలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, నావికాదళం సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇప్పటి వరకూ వెలికి తీసిన 22 మృతదేహాలను గుర్తించారు. ఐదుగురు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. పదిమందిని రక్షించి హాస్పిటల్‌లో చేర్చారు. బాధితులు చికిత్స పొందుతున్న హాస్పిటల్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ సందర్శించారు. బాధితులను పరామర్శించారు.