Pipigate విధాత‌:  కొద్దిరోజుల‌గా బెల్జియం మీడియా పీపీగేట్ కుంభ‌కోణం పేరుతో ప‌లు వార్తా క‌థ‌నాల‌ను వెలువ‌రిస్తోంది. ఈ కుంభ‌కోణంలో ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి పార్లమెంటుకు క్ష‌మాప‌ణ కూడా చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ పీపీగేట్ ఉదంతం అంటే ఏమిటంటూ మిగిలిన దేశాల‌కు చెందిన వారు ఆస‌క్తిగా సెర్చ్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏమైందంటే… బెల్జియం న్యాయ‌శాఖ మంత్రి వాన్ క్విక్ బోర్నే త‌న 50వ పుట్టినరోజు సంద‌ర్భంగా గ‌త నెల‌లో పెద్ద పార్టీ ఇచ్చారు. దీనికి ప్ర‌భుత్వ పెద్ద‌లు, […]

Pipigate

విధాత‌: కొద్దిరోజుల‌గా బెల్జియం మీడియా పీపీగేట్ కుంభ‌కోణం పేరుతో ప‌లు వార్తా క‌థ‌నాల‌ను వెలువ‌రిస్తోంది. ఈ కుంభ‌కోణంలో ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి పార్లమెంటుకు క్ష‌మాప‌ణ కూడా చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ పీపీగేట్ ఉదంతం అంటే ఏమిటంటూ మిగిలిన దేశాల‌కు చెందిన వారు ఆస‌క్తిగా సెర్చ్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏమైందంటే… బెల్జియం న్యాయ‌శాఖ మంత్రి వాన్ క్విక్ బోర్నే త‌న 50వ పుట్టినరోజు సంద‌ర్భంగా గ‌త నెల‌లో పెద్ద పార్టీ ఇచ్చారు.

దీనికి ప్ర‌భుత్వ పెద్ద‌లు, వివిధ పార్టీల నేత‌ల‌తో పాటు ఆయ‌న స్నేహితులు కూడా హాజ‌ర‌య్యారు. ఆ పార్టీలో తాగి జోగిన వాన్ స్నేహితులు ముగ్గురు ఆ మ‌త్తులో రోడ్డు ప‌క్క‌న నిలిపి ఉంచిన పోలీస్ వ్యాన్‌పై మూత్ర విస‌ర్జ‌న చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇటీవ‌ల మీడియాకు చిక్కింది. ఈ ఘ‌ట‌న‌కు పీపీగేట్ (మూత్ర‌విస‌ర్జ‌న‌) కుంభ‌కోణంగా అభివ‌ర్ణించిన బెల్జియం మీడియా వ‌రుస క‌థ‌నాల‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టింది.

దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన మంత్రి క్విక్ గురువారం త‌మ పార్ల‌మెంటుకు విచ్చేసి క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. జ‌రిగిన దానికి సిగ్గుతో త‌ల‌దించుకుంటున్నాన‌న్నారు. త‌న ముగ్గురు స్నేహితుల‌పై పోలీసుల ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురూ స‌ద‌రు చ‌ర్య‌కు పాల్ప‌డిన‌పుడు తాను న‌వ్వుతూ.. ఆ ప‌నిని ప్రోత్స‌హించిన‌ట్లు పేర్కొంటున్న సీసీటీవీ ఫుటేజీని మాత్రం ఆయ‌న ఖండించారు. తాను గాలిలో గిటార్ ప్లే చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు.

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న క్విక్ క‌ళ్ల ముందే జ‌రిగింద‌ని.. ఆయన త‌న స్నేహితుల చ‌ర్య‌ను ద‌గ్గ‌ర ఉండి చూశార‌ని తెలుస్తోంది. తొలుత ఆయ‌న కార్యాల‌యం వెలువ‌రించిన ప్ర‌క‌టన‌లో మంత్రి ఆ ఘ‌ట‌న స‌మ‌యంలో అక్క‌డ లేర‌ని పేర్కొన్నా.. సీసీటీవీ ఫుటేజీలు దానికి విరుద్ధంగా ఉండ‌టంతో క్విక్ పాత్ర‌పైనా అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ఆయ‌న త‌క్ష‌ణం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated On 9 Sep 2023 9:32 AM GMT
somu

somu

Next Story