Hug | ఒక్క కౌగిలింత ఎన్నో భావాలను వ్యక్త పరుస్తుంది. కష్టసుఖాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా హగ్( Hug ) చేసుకుంటే.. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. మన శరీరానికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అయితే ఒక్క కౌగిలింతతో అటు దంపతులు, ఇటు ప్రేమికులు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారని చెప్పొచ్చు. అభినందించేందుకు, ఓదార్చు ఇచ్చేందుకు ఈ కౌగిలింతలు ఎంతో ఉపయోగపడుతాయని పరిశోధనల్లో తేలింది. కౌగిలింతల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
భార్యాభర్తల మధ్య కౌగిలింతలు..
Couple Hugs భార్యాభర్తల మధ్య జరిగే కౌగిలింతలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయట. దంపతులిద్దరిలోనూ రక్తపోటు, మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఇద్దర్నీ మరింత దగ్గరకు చేస్తుందట. ఇద్దరి మధ్య ఒక భరోసాను కౌగిలింతలు కలిగిస్తాయట. అంతే కాదు ఈ కౌగిలింతలు శృంగార జీవితానికి ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తాయట. కౌగిలింతల నేపథ్యంలో భార్యాభర్తల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై.. మరింత ఉత్తేజితులను చేస్తుందట. భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా క్షమించమని అడిగేందుకు కౌగిలింతనే సరైందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు వీలైనన్ని సార్లు కౌగిలించుకుని వివాహ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
చిన్నారులకు బ్రెయిన్ షార్ప్..
చిన్నారులను తరుచూ హగ్ చేసుకోవడం వల్ల వారి బ్రెయిన్ షార్ప్( Brain ) అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలను పేరెంట్స్ కౌగిలించుకోవడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదల చాలా బాగుంటుందట. పాజిటివ్‌నెస్‌ను పెంచి, మెదడు చురుకుగా ఉండేలా చేస్తుందట. అనాథ పిల్లలను ఎవరూ కౌగిలించుకోకపోవడం వల్ల వారిలో మానసికంగా, శారీరకంగా కుంగుబాటు కనిపించినట్లు పలు అధ్యయనాల్లో తేలింది. పిల్లలు జన్మించిన వారం పది రోజులకే వారిని హగ్ చేసుకోవడం మరిచిపోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.
బతకడానికి నాలుగు హగ్‌లు తప్పనిసరి
అయితే ఓ మనిషి ప్రశాంతంగా జీవించడానికి హగ్‌లు తప్పనిసరి అని వర్జీనియాకు చెందిన ఓ థెరపిస్టు అధ్యయనంలో తేలింది. మనిషి బతకడానికి నాలుగు హగ్‌లు, రోజువారి పనులు సక్రమంగా చేయాలంటే 8, సక్రమమైన వృద్ధి కోసం 12 హగ్‌లు తప్పనిసరిగా చేసుకోవాలని ఆ థెరపిస్టు సూచించారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి కౌగిలింత చాలా అవసరమని చెప్పారు.