Wage Worker |
అతనో దినసరి కూలీ.. ప్రతి రోజు కష్టం చేస్తే వచ్చే సంపాదన అరకొర మాత్రమే. వచ్చిన ఆ సంపాదన నిత్యవసరాలకు, ఇతరత్రా ఖర్చులకు సరిపోతుంది. కానీ జమ చేసే అంతా డబ్బు అయితే రాదు. అయితే రాత్రికి రాత్రే ఆ కూలీ ఖాతాలో రూ. 100 కోట్లు జమ అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఆ దినసరి కూలీ ఖాతాను సీజ్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో వెలుగు చూసింది.
దినసరి కూలీ మాటల్లోనే.. నా పేరు మహమ్మ నసీరుల్లా మండల్. దినసరి కూలీగా పని చేస్తున్నాను. ఇటీవలే నాకు పోలీసులు నోటీసులు పంపారు. మీ ఖాతాలో రూ. 100 కోట్లు జమ అయ్యాయి. ఆ నగదు ఎక్కడిది..? ఎవరు..? పంపారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ రోజు నుంచి నాకు కంటి మీద కునుకు లేదు. పోలీసులు ఏం చేస్తారోనని నాతో పాటు నా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రూ. 100 కోట్ల జమ గురించి బ్యాంకు అధికారులను అడగ్గా వివరాలు ఏమీ ఇవ్వలేదు. పోలీసుల విచారణలో ఉంది కాబట్టి.. తాము వివరాలు ఏం చెప్పలేమని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆ రూ. 100 కోట్లు జమ అయ్యే కంటే ముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం రూ. 17 మాత్రమే అని మహమ్మద్ మండల్ తెలిపాడు.